Vijaywada: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా యాత్ర ముగిసిన వెంటనే చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు. వైద్యులు గాయాన్ని పరీక్షించి లోకల్ అనస్తీషియా ఇచ్చి మూడు కుట్లు వేశారు.
అనంతరం జగన్ కు విశ్రాంతి అవసరమని తెలిపారు. ఆస్పత్రిలో ఆయన సతీమణి వైఎస్ భారతి తోడుగా ఉన్నారు. ఇక చికిత్స అనంతరం జగన్ తిరిగి తన నైట్ హాల్టు ప్రాంతానికి వెళ్లారు. అయితే ఆదివారం జరగాల్సిన బస్సు యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి షెడ్యూలును ఆదివారం రాత్రి ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: CM JAGAN: జగన్ పై దాడి.. భద్రతపై ఈసీ సీరియస్ యాక్షన్!
కరెంట్ వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో..
ఇక ఈ ఘటనపై స్పందించిన విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా.. సీఎం వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. దాడి జరిగిన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న స్కూల్ భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కరెంట్ వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారని, దీంతో చీకటిగా ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. ఆ ప్రదేశంలో సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నాం. ప్రత్యేక బృందాలను నియమించాం. దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు.