కళ్లతోనే కామెడీని పలికించగల హాస్యదిగ్గజం, టాలీవుడ్ మీమ్స్ మహారాజు బ్రహ్మానందం శనివారం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. భార్య లక్ష్మి, పెద్ద కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌కు వెళ్లారు. తన చిన్న కొడుకుడు సిద్ధార్థ్ పెళ్లికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు.
తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను బ్రహ్మానందం దంపతులు కేసీఆర్-శోభ దంపతులకు అందజేశారు.హైదరాబాద్‌లో జరగబోయే కళ్యాణమహోత్సవానికి తప్పకుండా హాజరుకావాలని బ్రహ్మానందం కేసీఆర్‌ను కోరారు.ఈ సందర్భంగా బ్రహ్మిదంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు ప్రేక్షకులకు బ్రహ్మానందం పెద్ద కొడుకు గౌతమ్ అడపాదడపా సినిమాల్లో మెరిశారు. ప్రస్తుతం గౌతమ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక రెండో కుమారుడు,కాబోయే పెళ్లికుమారుడు సిద్ధార్థ్ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. తొలి నుంచీ సిద్దార్థ్ సినిమాలకు దూరంగానే ఉన్నారు.
విదేశాల్లో చదువుకుని ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మే 21న హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులతో పాటు వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఇప్పుడు పరిణయ తరుణం ముంచుకొస్తున్నందున బ్రహ్మానందం పెళ్లిపనుల్లో బిజీగా ఉన్నారు.అయితే, పెళ్లి ఏ తేదీన జరగబోతుందన్న విషయంపై సమాచారం లేదు.
2012 అక్టోబర్ 24న దసరా పండుగ రోజున హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో పెద్ద కుమారుడు గౌతమ్ కి జ్యోత్స్నరెడ్డితో వివాహమయ్యింది. ఈమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్రీనివాస్ రెడ్డి కుమార్తె. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు సంతానం.