పార్టీ మారినా పెత్తనం మేఘాదే.. ఆ సంస్థను బ్లాక్ లో పెట్టాల్సిందే!: ఏలేటి సంచలన ఆరోపణలు

తెలంగాణలో ప్రభుత్వం మారినా.. పెత్తానం మాత్రం నాసిరకం ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్న మేఘా కృష్ణారెడ్డిదేనని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నాయకులంతా కుమ్మక్కై ప్రజల సొమ్మును మేఘా కృష్ణారెడ్డికి దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.

New Update
పార్టీ మారినా పెత్తనం మేఘాదే.. ఆ సంస్థను బ్లాక్ లో పెట్టాల్సిందే!: ఏలేటి సంచలన ఆరోపణలు

ప్రభుత్వం మారినా.. పెత్తనం మాత్రం మేఘా కృష్ణారెడ్డిదేనని బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్టర్ మాత్రం మారడం లేదని ఫైర్ అయ్యారు. నాసిరకం పనులు చేసే కాంట్రాక్టులన్నీ మేఘా సంస్థకే ఇస్తున్నారని ఆరోపించారు. తద్వారా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న టెండర్ ను ఎస్కలెట్ చేయడంలో మేఘా కంపెనీ పాత్ర ఉందన్నారు. సుంకిశాల ప్రాజెక్ట్ గోడ కూలి పది రోజులు అయినా ప్రభుత్వం దృష్టికి రాలేదా? అని ప్రశ్నించారు. వచ్చినా.. ఆ సంస్థను కాపాడుకునేందుకే ఈ విషయాన్ని దాచారా? అన్న అనుమానాన్ని మహేశ్వరరెడ్డి వ్యక్తం చేశారు. నాయకులు నాసిరకం పనులు చేసే కాంట్రాక్టర్లను కాపాడుతున్నారని ఆరోపించారు. లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు.

మేఘా కోసం నాయకులు కుమ్మక్కు..
గతంలో సుంకిశాల అంచనా వ్యయాన్ని రూ. 800 కోట్లకు మేఘా సంస్థ పెంచుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ.4 వేల కోట్ల అంచనా వ్యయాన్ని పెంచిందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు క్రిమినల్ కాంట్రాక్టర్లకు వేల కోట్లు దోచి పెడుతున్నాని సంచలన ఆరోపణలు చేశారు మహేశ్వరరెడ్డి. నాయకులంతా కుమ్మక్కై ప్రజల సొమ్మును మేఘ కృష్ణా రెడ్డికి దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మేఘ సంస్థ మీద సీఎం రేవంత్ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. మరి ఇప్పుడెందుకు కాళేశ్వరం అవినీతి విషయాన్ని సీబీఐకి సిఫార్సు చేయడం లేదని ప్రశ్నించారు.

కాళేశ్వరం కమిటీని నీరుగార్చే కుట్ర..
కాళేశ్వరం అవినీతి మీద రిటైర్డు జడ్జి కమిటీ వేశారన్నారు. కానీ ఆ జడ్జికి మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఆయనకు కీలక ఫైల్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. కమిటీని ప్రభుత్వమే నీరు గార్చే పనిలో ఉందని ఆరోపించారు. ప్రభుత్వం తన జేబులో ఉందని మేఘ కృష్ణారెడ్డి దర్జాగా ఉన్నారన్నారు. అధికారంలో ఎవరు ఉన్నా.. తాను ఇచ్చే కమీషన్లకు లోగాల్సిందేనని మేఘా కృష్ణా రెడ్డి ధీమాతో ఉన్నారన్నారు. తీవ్రమైన ఆరోపణలు ఉండి.. అవినీతి విచారణ ఎదుర్కొంటున్న కంపెనీకి కాంటాక్టులు ఇవ్వడం వెనక ఉన్న మతలాబు ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ లో సైతం అభివృద్ధి పనులు కూడా మేఘా సంస్థకు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. మేఘ కృష్ణారెడ్డి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహేశ్వరరెడ్డి. మేఘా కంపెనీని వెంటనే ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య మేఘా సెటిల్మెంట్..
బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య మేఘా కృష్ణా రెడ్డి సెటిల్మెంట్ చేస్తున్నారని ఆరోపించారు. మేఘా సంస్థ ఒక క్రిమినల్ కంపెనీ అని చెప్పడానికి తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఆ ఆధారాలను ఎక్కడ సమర్పించాలో చెబితే అక్కడ సమర్పించడానికి తాను సిద్ధమన్నారు.  స్వయంగా కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మేఘా సంస్థ దొంగ గ్యారెంటీలు సమర్పించిందని ఆరోపణలు చేశారు. లేని బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించిన మేఘాపై ఎందుకు చర్యలు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాసిరకం పనుల నిర్వహణకు ఈ ఏడాది 27న మేఘా సంస్థకు కేంద్రం నోటీసులు ఇచ్చింది నిజం కదా? అని ప్రశ్నించారు.

సీబీఐ విచారణ చేయించే బాధ్యత మాదే..
ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న కంపెనీకి కృష్ణారెడ్డి అధిపతి అని ధ్వజమెత్తారు. మేఘా సంస్థ అవినీతిపై సోమవారం మరో సారి పూర్తి ఆధారాలతో ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు.  మేఘా సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తాము ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సుంకిశాల డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నిర్మాణాల్లో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇస్తే కేంద్రం ఇన్వాల్వ్ అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఇస్తే సీబీఐ విచారణ చేయించే బాధ్యత తమదని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు