BRS MLA Prakash Goud: బీఆర్ఎస్ కు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బిగ్ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కార్పోరేటర్లతో కలిసి ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. రేవంత్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో బీఆర్ఎస్ ను వీడిని ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 30కి పడిపోయింది. రేపు బీఆర్ఎస్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ సైతం కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు గాంధీభవన్ లో టాక్ నడుస్తోంది.
ప్రకాష్ గౌడ్ విషయానికి వస్తే.. 2009 నుంచి ఆయన రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం వరుసగా విజయాలు సాధిస్తున్నారు. 2009, 14 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించారు. 2014 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ నుంచే 2018, 23 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన పార్టీ వీడుతారన్న ప్రచారం సాగుతోంది. ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
అప్పటి నుంచి ఆయన పార్టీ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎంపీ ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారుతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో ప్రకాశ్ గౌడ్ పార్టీ మారలేదు. ఇటీవల ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో కేసీఆర్ ను సైతం ఆయన కలిశారు. దీంతో ప్రకాశ్ గౌడ్ పార్టీ మార్పు వార్తలకు కాస్త బ్రేక్ పడ్డాయి. కానీ.. ఆయన మళ్లీ మనసు మార్చుకున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.