Attack on TDP meeting: టీడీపీ కార్యక్రమంపై ఆగంతకుల రాళ్లదాడితో పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ముప్పా ళ్ల మండలం తొండపి గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఊర్లో టీడీపీ జెండా ఆవిష్కరణతో పాటు పార్టీలో పలువురి చేరిక సందర్భంగా ఆదివారం రాత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna LaxmiNarayana) ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ‘బాబు ష్యూరిటీ, భవష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. అయితే, ఒక్కసారిగా కొందరు దుండగులు రెచ్చిపోయి రాళ్లతో దాడికి దిగారు.
ఇది కూడా చదవండి: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు
లైట్లు ఆర్పేసి బిల్డింగుల మీది నుంచి రాళ్లు విసిరారు. ఆగంతకుల దాడిలో కన్నా లక్ష్మీనారాయణ పీఏ స్వామి, టీడీపీ నాయకులు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దాడి నేపథ్యంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అటు వైపు వెళ్లకుండా వెనక్కి వచ్చి గ్రామంలోనే ఉండిపోయారు. విషయం తెలిసి గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.
ఇది కూడా చదవండి: విషాదం.. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు మృతి..
అయితే తమపై రాళ్ల దాడిని నిలువరించలేకపోయారంటూ పోలీసులపై టీడీపీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ నాయకులే తమపై రాళ్లతో దాడి చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే అధికార పార్టీ నాయకులు ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడికి దిగారని విమర్శిస్తున్నారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.