39 ఏళ్ల వయసులో క్రిస్టియానో రొనాల్డో  రికార్డుల మోత!

ప్రతిభకు వయసుతో ఏమాత్రం సంబంధంలేదని పోర్చుగీసు సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి చాటి చెప్పాడు. 39 సంవత్సరాల వయసులో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.ఇన్ స్టాగ్రామ్ లో రోనాల్డ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిగా మారాయి.

New Update
39 ఏళ్ల వయసులో క్రిస్టియానో రొనాల్డో  రికార్డుల మోత!

ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందిన ఫుట్ బాల్ క్రీడలో గత రెండుదశాబ్దాలుగా గోల్స్ మోత మోగిస్తున్న ఏకైక ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మాత్రమే. పోర్చుగల్ కు చెందిన ఈ గోల్స్ మెషీన్..యూరోపియన్ లీగ్ సాకర్ లో వివిధ జట్ల తరపున రికార్డుల మోత మోగించిన తరువాత..సౌదీ అరేబియా ప్రో లీగ్ వైపు దృష్టి మళ్లించాడు. ఇప్పటికే మూడు వేర్వేరు లీగ్ ల్లో టాప్ స్కోరర్ గా రికార్డుల మోత మోగించిన 39 సంవత్సరాల రొనాల్డో ..2024 సౌదీ ప్రో లీగ్ లో సైతం సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఓ సీజన్లో అత్యధికంగా 35 గోల్స్ సాధించిన తొలి ప్లేయర్ గా రికార్డుల్లో చేరాడు. మొత్తం 34 మ్యాచ్ ల ఈ రౌండ్ రాబిన్ లీగ్ టోర్నీలోని తన ఆఖరి రౌండ్ మ్యాచ్ లో అల్-ఇత్తిహాద్ జట్టుపై అల్- నాజర్ క్లబ్ 4-2 గోల్స్ సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు. ఆట మొదటి భాగం ముగిసే క్షణాలలో మహ్మద్ అల్-ఫాతిల్ అందించిన పాస్ ను గోలుగా మలచడం ద్వారా ప్రస్తుత సీజన్లో తన గోల్స్ సంఖ్యను 34కు పెంచుకొన్నాడు. ఆట ముగియటానికి మరో 21 నిముషాల మిగిలిఉండగా..ఓ కార్నర్ ను హెడ్డర్ గోల్ గా మార్చడం ద్వారా 35 గోల్స్ తో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

సౌదీ ప్రోలీగ్ చరిత్రలో ఓ సీజన్ లో అత్యధికంగా 35 గోల్స్ సాధించిన తొలిఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రొనాల్డో సాధించిన మొత్తం 35 గోల్స్ లో నాలుగు హాట్రిక్ లు సైతం ఉన్నాయి. 4హాట్రిక్ లతో 35 గోల్స్.... ఇప్పటి వరకూ అల్- నాజర్ క్లబ్ మాజీ ఆటగాడు అబ్దుల్ రజాక్ హామదుల్లా 2018-19 సీజన్లో సాధించిన 34 గోల్స్ రికార్డును రొనాల్డో 35 గోల్సుతో అధిగమించగలిగాడు. సౌదీలీగ్ లో అల్-హిలాల్ విజేతగా నిలువగా..క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని అల్- నాజర్ క్లబ్ రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తాను రికార్డుల వెంట పడనని..రికార్డులే తన వెంట పడతాయని క్రిస్టియానో రొనాల్డో ఈ సరికొత్త రికార్డుపై ఇన్ స్టా ద్వారా వ్యాఖ్యానించాడు. సౌదీ ప్రో లీగ్ 2023- 2024 సీజన్లో మొత్తం 100 గోల్స్ నమోదు కాగా..అందులో రొనాల్డో ఒక్కడే 35 గోల్స్ సాధించడం విశేషం. జూలై 14 నుంచి జరిగే 2024 యూరోకప్ సాకర్ లో పోర్చుగల్ కు రొనాల్డో నాయకత్వం వహించనున్నాడు. రొనాల్డో నేతృత్వంలోనే 2016 యూరోకప్ ను పోర్చుగల్ నెగ్గిన తరువాత..మరో ట్రోఫీ కోసం పోర్చుగల్ జట్టు ఎదురుచూస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు