AP CM Jagan: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో డాక్టర్లు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్‌ను చేస్తున్నారు. కేసీఆర్ గురువారం అర్ధరాత్రి కాలు జారి.. కిందపడటంతో కాలికి గాయమైంది. ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్‌కు తరలించారు. పరిశీలించిన వైద్యులు కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు గుర్తించారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
తాజాగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఫోన్‌లో పరామర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారిపడడంతో కాలు విరిగిన విషయాన్ని తెలుసుకున్న జగన్ శుక్రవారం కేటీఆర్‌కు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read: కేసీఆర్ ఆరోగ్య స్థితిపై చంద్రబాబు, పవన్ ఏం అన్నారంటే?
కేసీఆర్ గాయపడటంపై టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం సోషల్ మీడియాలో స్పందించారు. కేసీఆర్ గాయపడ్డారనే వార్త విని ఆందోళనకు గురయ్యానని చంద్రబాబు తెలిపారు. త్వరగా, సంపూర్ణంగా ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. గాయం నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జారిపడి గాయమైందని తెలిసి బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కేసీఆర్ త్వరగా… సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. అనారోగ్య పరిస్థితులను మనోధైర్యంతో కేసీఆర్ అధిగమించాలన్నారు. కేసీఆర్ కోలుకొని ప్రజలకు సేవ చేస్తారని ఆకాంక్షించారు.