AP CID Chief: ఏపీలో ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి తిరుగులేని విధంగా పట్టం కట్టారు. వైసీపీని మర్చిపోలేని విధంగా చావుదెబ్బ తీశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరగబోతోంది. అయితే, సరిగ్గా ఇదే సమయంలో ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ సెలవుపై విదేశాలకు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన ఈరోజు (జూన్ 5) నుంచి వచ్చే నెల అంటే జూలై 3 వరకూ సెలవు తీసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలతో అమెరికా పర్యటనకు వెళ్లాలని ఆయన సెలవు పెట్టారు. ఆ సెలవును సీఎస్ జవహర్ రెడ్డి వెంటనే ఆమోదించారు. మంగళవారమే ఉత్తర్వులు జారీచేశారు.
Also Read: మా అబ్బాయి పడిన కష్టాలకు దేవుడు ఫలితాన్నిచ్చాడు!
AP CID Chief: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీకి చెందిన నేతలపై తప్పుడు కేసులు నమోదు చేసి.. అరెస్టులు చేసిన అధికారిగా సంజయ్ అందరికీ తెలిసినవారే. అత్యంత వివాదాస్పదంగా గత ప్రభుత్వంలో పేరు తెచ్చుకున్న సంజయ్ ఇప్పుడు సీలవుపై విదేశాలకు వెళ్లడం సంచలనమనే చెప్పవచ్చు. కూటమి ఘన విజయం.. అధికార వైసీపీ ఘోర పరాజయం తరువాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సీఐడీ బాస్ సంజయ్ సెలవులో విదేశాలకు చెక్కేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా, మరింత మంది అధికారులు సంజయ్ రూట్ లోనే ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తమకు ఇబ్బందులు తప్పవనే భావనతో అప్పట్లో ప్రతిపక్షాల పట్ల దూకుడుగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో కొన్నిరోజులు సెలవుపై వెళ్లే యోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.