అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి ఉదృతి కొనసాగుతోంది. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జిల్లాలో ఉన్న వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ద గౌతమి నదులకు వరద పోటెత్తుతోంది. వరదలతో కోటిపల్లి-ముక్తేశ్వర మధ్య ఉన్న రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల వల్ల రైతులు భారీ ఎత్తున పంట నష్టపోయారు. భారీ వర్షాలు, వరదల వల్ల వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంత వాసులను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది పునరావాస కేంద్రాలకు తరలించారు.
మరోవైపు ముక్తేశ్వరం-కోటిపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిపై స్థానిక మత్స్యకారులతో Rtv బృందం సాహస ప్రయాణం చేసింది. మత్య్సకారులతో వెళ్తున్న బోటు నది మధ్యలోకి రాగానే అక్కడ సుడిగుండం ఏర్పడింది. దీంతో మత్య్సకారులు భయాందోళనకు గురయ్యారు. సుడిగుండంలా వస్తున్న అలలతో బోటు సుడులు తిరుగుతూ ఒడ్డున ఉన్న ఓ చెట్టును ఢీ కొట్టబోయింది. బోటు చెట్టు ముళ్లకోమ్మల కింద నుంచి వెళ్లడంతో బోటుకు తృటిలో పెను ప్రమాదం తప్పినట్లైంది. దీంతో మత్య్సకారులు ఊపిరి పీల్చుకున్నారు.
మత్య్సకారులతో సాహస ప్రయాణం చేసిన Rtv వారి సమస్యలను అడిగి తెలుసుకోగా.. మత్య్సకారులు, వరద బాధిత గ్రామ ప్రజలు వారి గోడును వెళ్లబోసుకున్నారు. తమ ప్రాంతాలకు ఎప్పుడు వరద వస్తుందో తెలియదని, తాము నిత్యం భయాందోళనతో ఇబ్బంది పడుతున్నట్లు వారు వాపోయారు. ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు తమకు అనేక హామీలు ఇచ్చారని వారు గుర్తు చేశారు. కానీ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు తమకు ఎలాంటి పరిహారం కానీ, సహాయం కానీ అందలేదన్నారు. లంక గ్రామాలకు వచ్చే వారిని, ఇక్కడి నుంచి వెళ్లే వారిని తమ బోటు ద్వారా తిప్పడమే తమ వృత్తి అని కొందరు తెలిపారు.
ప్రభుత్వం ఇకనైనా తమ సమస్యలు విని తమకు పక్కా ఇళ్లు కట్టించాలని వారు Rtv ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తమ సమస్యలు పట్టించుకోని వారు ఓట్ల కోసం వస్తే వారిని తమ గ్రామాలకు రానివ్వబోమని మత్స్యకారులు తేల్చి చెప్పారు. మరోవైపు వరద ప్రవాహం వల్ల తాము పడవ ప్రయాణాలు నిలిపివేసినట్లు, దీంతో తాము జీవనాధారం కోల్పోయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకు తినడానికి తిండికూడా దొరకని పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు వరదల్లో చికుక్కున్న లంక గ్రామ ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తలిస్తున్నారు. వరద ప్రవాహం కాస్త తగ్గినా గ్రామాల్లో మాత్రం నీరు తగ్గకపోవడంతో మరో 15 రోజుల పాటు వరద బాధితులు పునరావాస కేంద్రంలో ఉండనున్నారు.