/rtv/media/media_files/2026/01/21/ap-pomegranate-farmers-2026-01-21-10-16-27.jpg)
AP Pomegranate Farmers
AP Pomegranate Farmers: గత కొంతకాలంగా సరైన ధరలు లేక ఇబ్బందులు పడిన దానిమ్మ రైతులకు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్‌లో దానిమ్మకు రికార్డు స్థాయి ధరలు లభిస్తున్నాయి. నాణ్యతను బట్టి వ్యాపారులు టన్నుకు రూ.2 లక్షల వరకు చెల్లిస్తున్నారు.
మూడు నెలల క్రితం దానిమ్మ టన్ను ధర కేవలం రూ.50 వేలే ఉండేది. నెల రోజుల క్రితం కూడా రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల మధ్యే ధర ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా ధర భారీగా పెరగడంతో రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 15,422 హెక్టార్లలో దానిమ్మ సాగు జరుగుతోంది. దీని ద్వారా సుమారు 3.85 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సాగు ఉన్నప్పటికీ, ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా 11 వేల హెక్టార్లలో దానిమ్మ పండిస్తున్నారు.
ధరలు పెరగడానికి పండ్ల నాణ్యత పెరగడం కూడా ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. రైతులు ఇప్పుడు ఫ్రూట్ కవర్స్, ప్లాంట్ కవర్స్ వంటి పద్ధతులు ఉపయోగించడం వల్ల దానిమ్మ పండ్లు మంచి రంగు, ఆకర్షణతో తయారవుతున్నాయి. ఈ విధానం వల్ల పురుగులు, తెగుళ్లు తగ్గి పండ్ల నాణ్యత పెరిగిందని తెలిపారు.
ఇక మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో దానిమ్మ దిగుబడులు ఆలస్యం కావడం కూడా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. మార్కెట్‌లో సరఫరా తగ్గడంతో వ్యాపారులు ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు.
ఇప్పటికే గత నవంబర్‌లో కూడా దానిమ్మ ధరలు ఒక్కసారిగా పెరిగి టన్నుకు రూ.1.50 లక్షలకు చేరాయి. ప్రస్తుతం అయితే మరింత పెరిగి రైతులకు కాసుల పంట పండిస్తోంది.
దానిమ్మ కాయలతో పాటు ఆకులు, వేర్లు, రసం కూడా రైతులకు అదనపు ఆదాయం తీసుకువస్తున్నాయి. వీటిని ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద దానిమ్మ ధరలు పెరగడంతో రైతులు ఆనందంగా ఉన్నారు, భారీ లాభాలు పొందుతున్నారు.
Follow Us