/rtv/media/media_files/2026/01/29/jagan-padhayatra-2026-01-29-07-52-25.jpg)
Jagan 2.0
Jagan 2.0: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి పాదయాత్ర(YS Jagan Padhayatra)పై స్పష్టత ఇచ్చారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా వచ్చే ఏడాదిన్నర పాటు ప్రజల మధ్యే ఉండి పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. ఈ యాత్రలో రాష్ట్రవ్యాప్తంగా 150 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి కార్యకర్తను ప్రత్యక్షంగా కలుస్తానని తెలిపారు. పార్టీని మళ్లీ బలంగా నిలబెట్టడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని చెప్పారు.
బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేశారు. అదే సమయంలో తన రాజకీయ ప్రయాణంలో మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. రాబోయే కాలాన్ని “జగన్ 2.0”గా పేర్కొంటూ, ఇది పూర్తిగా కార్యకర్తలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
గతంలో పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టానని, ఆ కారణంగా పార్టీ శ్రేణులకు సరైన సమయం ఇవ్వలేకపోయానని జగన్ అంగీకరించారు. ఇకపై గ్రామ స్థాయి నుంచే కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు బాధ్యతలు ఇస్తామని చెప్పారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారి ద్వారా ప్రజలకు మరింత చేరువ కావచ్చని అభిప్రాయపడ్డారు.
2024 ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత వైసీపీలో కొత్త ఉత్సాహం తీసుకురావడమే తన లక్ష్యమని జగన్ తెలిపారు. చంద్రబాబు పాలన తర్వాత తానే తిరిగి అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. “జగన్ 2.0 లో పోరాటం మామూలుగా ఉండదు” అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
పాదయాత్ర 2.0 ప్రారంభమవుతుందని, మూడు రోజులకు ఒకసారి భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో 150 చోట్ల ప్రత్యక్షంగా పర్యటిస్తానన్నారు. పాదయాత్ర రూట్ ఇంకా ఖరారు కాలేదని, రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం వరకు సాగేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
2019 ఎన్నికల ముందు చేసిన పాదయాత్ర పార్టీకి భారీ విజయాన్ని అందించిందన్న నమ్మకం జగన్‌కు ఉందని నేతలు చెబుతున్నారు. అప్పట్లో 151 సీట్లు గెలిచిన అనుభవమే ఇప్పుడు ఈ కొత్త వ్యూహానికి ప్రేరణగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పాదయాత్ర ద్వారా కార్యకర్తల్లో ధైర్యం నింపి, రాబోయే రాజకీయ పోరాటానికి పార్టీని సిద్ధం చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Follow Us