Speaker Ayyanna Patrudu: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం RTC డిపోకు చెందిన స్థలాల్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై స్పీకర్ అయన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే స్పీకర్ పదవినైనా వదులుకుంటా.. కానీ, ఆర్టీసీ స్థలం మాత్రం లీజుకు ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.
నర్సీపట్నం ఆర్టీసీ స్థలంలో ప్రైవేటు నిర్మాణాల కోసం కేటాయించిన స్థలంలో కాంట్రాక్టర్ డంపింగ్ చేసిన మట్టిని అయన్న పరిశీలించారు. రైతుల్ని ఒప్పించి అప్పట్లో ఆర్టీసీకి స్థలం సేకరించామని.. దీనిని వీలైనంత వరకు ఆర్టీసీకే వినియోగించాలని అన్నారు. భవిష్యత్ అవసరాల కోసం ఇది ఉపయోగపడుతుందని.. ఇది ప్రజల స్థలం, ప్రజలకే ఉపాయోగించాలని వ్యాఖ్యానించారు.
Also Read: దొంగలుగా మారిన పోలీసులు.. రూ. 25 లక్షలు రీకవరీ చేసి..
అప్పట్లో రైతులు త్యాగం చేసి ఇచ్చిన స్థలాన్ని ఇప్పుడు ఎవరో వచ్చి వ్యాపారం చేయడం అన్యాయం అన్నారు. దీనిపై గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే దానిని అడుకున్నారన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ ఫ్లాట్ ఫాంలను అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. అయినా, ప్రైవేటు వ్యక్తులకు లీజు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు.
ప్రైవేటు వ్యక్తులు మట్టిని వేసినా డిపో మేనేజర్ తనకు ఏమీ తెలియడం లేదని అంటున్నారని.. ఎందుకు ఇలా చేస్తున్నారు అని కూడా ప్రశ్నించలేదని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే, డిపో మేనేజర్, కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారనట్లు తెలుస్తుందన్నారు. వెంటనే ఆర్టీసీ సెక్యూరిటీని సస్పెండ్ చేసి, పనులు ఆపాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో మట్టిని వేసిన వారిపై చర్యలు చేపట్టాలని డీఎంకు ఆదేశించారు.