Anant Ambani Pre Wedding: సామాన్యుడికి బస్టాప్ ఉండదు.. కానీ, అంబానీ కోసం.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్..  

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ లోని జామ్ నగర్ లో జరుగుతున్నాయి. దీని కోసం అక్కడి ఎయిర్ పోర్ట్ కు పది రోజుల పాటు తాత్కాలిక అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పించారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకోవచ్చు. 

New Update
Anant Ambani Pre Wedding: సామాన్యుడికి బస్టాప్ ఉండదు.. కానీ, అంబానీ కోసం.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్..  

Anant Ambani Pre Wedding: డబ్బుంటే చాలు.. కొండమీద కోతి అయినా దిగొస్తుంది అంటారు. ఇది ఎప్పుడో పాత మాట. ఇప్పుడు డబ్బుంటే విమానమేం ఖర్మ.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మనూరికి వచ్చేస్తుంది. ఏమిటి.. అర్ధం కాలేదా? విషయం ఏమిటంటే.. రిలయన్స్ అధినేత.. భారతదేశ కుబేరుడు.. వ్యాపారవేత్త.. ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి జూలై లో జరగబోతోంది. ఆ వేడుకకు ముందస్తుగా అంటే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. మూడురోజుల వేడుక.. అందులోనూ అంబానీ ఇంట ఉత్సవం.. ఇంకేముంది.. ప్రపంచంలోని కుబేరులు.. వ్యాపారులు.. సెలబ్రిటీలు.. ఓ వెయ్యిమంది వరకూ కుటుంబాలతో సహా గుజరాత్ లోని జామ్ నగర్ కు క్యూ కట్టారు. మరి వీళ్ళందరూ మనలా బస్సుల్లో.. రైళ్లలో  వెళ్ళలేరు కదా.. సొంత విమానాలేసుకుని వచ్చేశారు. వీరి విమానాలు దిగడానికి ఎయిర్ పోర్ట్ కావాలి. జామ్ నగర్ ఎయిర్ పోర్ట్ ఏమో చిన్నది. టెక్నీకల్ గా దేశీయ విమానాశ్రయం. దీంతో అంబానీ ఇంట వేడుక(Anant Ambani Pre Wedding) కోసం ఈ విమానాశ్రయాన్ని ఓ పది రోజుల పాటు తాత్కాలిక అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేశారు. మరి ఈ తాత్కాలిక అంతర్జాతీయ విమానాశ్రయం వివరాలేమిటో తెలుసుకుందాం ఇప్పుడు. 

జామ్ నగర్ లో ఒక ఎయిర్ పోర్ట్ ఉంది. ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం తాత్కాలికంగా జామ్ నగర్ ఎయిర్ పోర్ట్ కు 10 రోజుల పాటు అంతర్జాతీయ హోదా కల్పించారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 5 వరకు అంతర్జాతీయ విమానాలరాకపోకలకు  విమానాశ్రయానికి అనుమతి ఉందని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. అది నిజానికి డిఫెన్స్ ఎయిర్ పోర్ట్. దానినే కమర్షియల్ పర్పస్ కోసం కూడా ఉపయోగించుకుంటున్నారు. దీని కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ప్రయాణీకుల టెర్మినల్ భవనాన్ని నిర్మించింది. ఇక్కడి వరకే రోజువారీ సాధారణ ప్రయాణీకుల విమానాలు అవీ దేశీయ విమానాలు మాత్రమే అక్కడ రాకపోకలు సాగిస్తుంటాయి. ఆ ప్రాంతం తప్ప మిగిలిన ప్రాంతం అంతా సున్నితమైన ప్రాంతంగా వ్యవహరిస్తారు. ఆ ప్రాంతంలో సివిల్ విమానాలు అనుమతించరు. అయితే, ఈ అనధికార అధికారోత్సవం(Anant Ambani Pre Wedding) కోసం ఆ ప్రాంతంలోనూ విమానాలను అనుమతిస్తున్నారు. "ఒకే సమయానికి మూడు విమానాల వరకు సాంకేతికంగా సున్నితమైన ప్రాంతంలో వసతి కల్పిస్తున్నారు" అని అక్కడి పరిస్థితిపై పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక విమానాశ్రయ అధికారిచెప్పినట్లుగా జాతీయమీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

Also Read: హస్తా నక్షత్రంలో అనంత్ అంబానీ-రాధిక వివాహం.. ఈ నక్షత్రం ప్రత్యేకత ఏమిటో తెలుసా.?

ఇంకో విషయం ఏమిటంటే.. సాధారణంగా ఈ విమానాశ్రయ ప్రాంతంలో ఫాల్కన్-200ల వంటి ఆరు చిన్న విమానాలు లేదా ఎయిర్‌బస్ A320 వంటి మూడు పెద్ద విమానాలు ఉంటాయి. కానీ, శుక్రవారం మొత్తం 140 విమానాల రాక పోకలు జరిగినట్టు.. ఆ అధికారి చెప్పారు. అంతేకాదు.. ఈ విమానాశ్రయ భవనం 475 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండేది. ఇప్పుడు ఈ ఈవెంట్(Anant Ambani Pre Wedding)కి ముందు దానిని ఆఘమేఘాల మీద 900 చదరపు మీటర్లకు విస్తరించారు. రద్దీ సమయాల్లో ఇక్కడ 180 మంది ప్రయాణీకులకు వసతి కల్పించేది. ఇప్పుడు ఇక్కడ 360 మంది ప్రయాణీకులకు వసతి కల్పించే అవకాశం ఇప్పుడు ఉంది. 

ఇదిలా ఉంటే, విమానాశ్రయంలో ప్రతి సెక్టార్ లోనూ సిబ్బందిని పెంచారు. ఇంతకు ముందు ఇక్కడ 16 మంది హౌస్ కీపింగ్ సిబ్బంది ఉండేవారు. వారి సంఖ్య ఇప్పుడు 35 అయింది. అలానే భద్రతా సిబ్బంది సంఖ్య కూడా పెరిగింది. ఇంతకు ముందు 35 మంది భద్రతా సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అంటే 70కి చేరింది. అలాగే,  గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలు కూడా తమ సిబ్బంది సంఖ్యను 65 నుంచి 125కి పెంచాయి.

అదండీ విషయం.. సామాన్యులు ఏదైనా పెళ్లి లేదా వేడుక జరుపుకుంటే.. దానికి కావలసిన అనుమతులకు తిప్పలు పడాలి. స్థానిక అధికారుల చుట్టూ బతిమాలుతూ తిరగాలి. అదే డబ్బున్న అంబానీ లాంటి వారికైతే అన్నీ అధికారికంగా అమరిపోతాయి అంతే! 

Advertisment
తాజా కథనాలు