Breaking: జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan)తో పార్టీ కార్యాలయంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) భేటీ అయ్యారు. ఇటీవలే, వైసీపీలో చేరిన అంబటి రాయుడు పది రోజులకే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తో భేటీ కీలకంగా మారింది. అంబటి రాయుడు జనసేన లోకి చేరనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా పొన్నూరు లేదంటే కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. దాదాపు అరగంట నుండి పవన్ రాయుడు భేటి కొనసాగుతుంది.
Also Read: బొత్సకు వైసీపీ ఫ్యామిలీ ప్యాకేజీ.. మూడు ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాల్లో మంత్రి బలగం!
వైసీపీలో చేరిన పది రోజుల్లోనే రాజీనామా
డిసెంబర్ 28వ తేదీన అధికార పార్టీ వైసీపీలో చేరారు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. అయితే, సరిగ్గా పార్టీలో జాయిన్ అయిన పది రోజుల్లోనే పార్టీని వీడుతున్నట్టు తెలిపాడు. కనీసం పార్టీ వ్యవహారాల్లో ఒక్కసారైనా జోక్యం చేసుకోకుండా రాజీనామా చేయడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారింది.
కారణం ఇదేనంటూ ట్వీట్
రాజీనామ చేసిన అనంతరం మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. జనవరి 20 నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నానని.. ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదని అందుకే వైసీపీకి రాజీనమా చేస్తున్నానని పేర్కొన్నారు.
జనసేలోకి చేరే అవకాశం
కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని..తన తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, దీనిపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పార్టీలో చేరిన వారం రోజుల్లోనే రాజీనామ చేశారంటే ఆ పార్టీలో ప్రతికూల పరిస్థితులే కారణమని అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు. ఇదిలా ఉండగా తాజాగా, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వడం సంచలనంగా మారింది. అంబటి రాయుడు జనసేనలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతంది.