తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) ఎంపీ టికెట్ల వ్యవహారం కొత్తం పంచాయితీకి దారి తీసింది. నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ సీనియర్ నేత మల్లు రవికి దాదాపు ఖరారు అయినట్లు వార్తలు రావడంతో మరో నేత సంపత్ కుమార్ (Sampath Kumar) భగ్గుమన్నారు. తనకు కాకుండా మల్లు రవికి టికెట్ రావడం వెనుక ఖమ్మం కోటరీ ఉందంటూ ఫైర్ అవుతున్నారు. ఈ విషయమై నేరుగా సోనియాగాంధీకే లేఖ రాశారు. ఈ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గానికి లక్షల సంఖ్యలో ఓటింగ్ ఉందని.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా వేలల్లో ఓటింగ్ ఉన్న మాలలకు టికెట్ ఇవ్వడం వెనుక కుట్ర ఉందని ఆయన తన లేఖలో ఆరోపించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: BRS : బీఆర్‌ఎస్ కు మరో షాక్… ఖమ్మం ఎంపీ నామా రాజీనామా?!
ఖమ్మం టికెట్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినికి దక్కకుండా మంత్రి పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డిని తెరపైకి తెచ్చాడన్నారు. ఆయనకు టికెట్ ఇప్పించుకోవడం కోసమే ఇక్కడ భట్టి సోదరుడు మల్లు రవికి టికెట్ వచ్చేలా ఖమ్మం కోటరీ పని చేస్తోందని సంపత్ పేర్కొన్నారు. ముప్పై ఏళ్లుగా పార్టీలో వివిధ హోదాల్లో తాను పని చేశానని గుర్తు చేశారు.
తనను పక్కన పెట్టి వరుసగా 4 ఎన్నికల్లో ఓటమి పాలైన మల్లు రవికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తనకు టికెట్ ఇవ్వాలని సోనియాను కోరారు. ఇప్పటికే మల్లు రవికి ఢిల్లీలో ప్రభుత్వ పతినిధిగా నామినేటెడ్ పదవి ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. దీంతో సోనియాకు సంపత్ కుమార్ రాసిన లేఖ పార్టీలో చర్చనీయాంశమైంది.