ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల నుంచి పాప వినాశనం మార్గంలో పార్వేటి మండపానికి కూతవేటు దూరంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రేగింది. దీంతో మంటలు భారీ ఎత్తున ఎగిసి పడ్డాయి. వెంటనే గుర్తించిన టీటీడీ ఫారెస్ట్ , వైల్డ్ లైఫ్ అధికారులు అప్రమత్తమై మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేసే పనిలో పడ్డారు. ఈ ప్రాంతంలో టీటీడీ శ్రీవారి కోసం శ్రీగంధం చెట్లను ఏర్పాటు చేసి పెంచుతుంది. ఘటనా స్థలంలో రెండు ఫైర్ ఇంజన్లు రెండు వాటర్ ట్యాంకులతో అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంతవరకు ఎవరికి సమాచారం లేదు. టీటీడీ అధికారులు…వేసవి దృష్ట్యా చర్యలు తీసుకున్నారు. అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపించకుండా మట్టిరోడ్లు, మధ్యలో ఎండిన చెట్లు ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా తొలగించారు. అయినప్పటికీ ప్రమాదం జరగడంతో టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మంటలకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. శేషాచలం అడవుల్లో మంటలు కనిపించిన దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియోలోని విజువల్స్ ప్రకారం గత రాత్రి నుంచే శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.