2008, నవంబరు 26 ఈ రోజు భారతదేశ చరిత్రలో చీకటి రోజునే చెప్పాలి. అభంశుభం తెలియని అమాయకులు ఉగ్రమూకలకు బలై పోయిన రోజు. ఆ బాధ నుంచి కోలుకుంటున్నవారు కొందరైతే.. అయిన వారిని కోల్పోయి వారి జ్ఞాపకాలతో బాధపడుతున్నవారు కొందరు.
ఇప్పటికీ మాననిగాయం:
ముంబై(Mumbai) మహానగరంలో 15 ఏళ్ల కిందట నవంబరు 26న పాకిస్థాన్ ఉగ్రవాదులు సృష్టించిన మారణహెూమం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఉగ్రవాద దాడుల్లో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఇంతటి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిన ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన తమ కుటుంబ సభ్యుల్ని తలచుకొని ఇప్పటికీ కన్నీరు మున్నీరవుతున్నారు.
2008 నవంబరు 26న పాకిస్థాన్‌లోని కరాచీ(Karachi) రేవు నుంచి అరేబియా సముద్రం ద్వారా లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన అజ్మల్ కసబ్, మరో తొమ్మిది మంది ముంబైలోకి చొరబడ్డారు. ఒబెరాయ్ హెూటల్, తాజ్, ఛత్రపతి శివాజీ టెర్మినస్ల వద్ద నాలుగు రోజుల పాటు హెూటల్స్లో ఉన్న దేశ విదేశీయులను బంధీలుగా చేసుకొని మారణ హెూమం సృష్టించారు.. లోపలి దాగి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత దళాలకు మూడు రోజులకు పైగా సమయం పట్టింది.
చిక్కిన కసబ్:
పది మంది ఉగ్రవాదుల్లో 9 మంది హతమవ్వగా.. ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ కసబ్(Ajmal kasab)ను తర్వాత ఉరి తీశారు. ఈ భయంకర దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో ముంబై నగరం భయంతో వణికిపోయింది. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే తన ప్రాణాలను ఫణంగా పెట్టి, వీరోచితగా పోరాడి అమరుడయ్యారు.
నాటి ఆ ఉదంతం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఈ ఆపరేషన్‌లో ప్రాణాలతో పట్టుబడ్డ అజ్మల్ కసబ్‌ను విచారించారు.. తర్వాత అతడికి మరణశిక్ష విధించారు. ఈ ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత 2012 నవంబరులో కసబ్‌ను ఎరవాడ జైలులో ఉరి తీశారు.
పాక్ చేసిన కుట్రే!
ముంబైలో జరిగిన ఉగ్రదాడికి వ్యూహ రచన పాకిస్థాన్‌లోనే జరిగింది. దీనికి సంబంధించి ఎన్నో ఆధారాలను భారత్ బయటపెట్టింది. పాక్ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు మహ్మాద్ అలీ దురానీ కూడా దీనిని ధ్రువీకరించారు కూడా. కానీ దాయాది మాత్రం తమకు ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికీ దబాయిస్తోంది. నాటి ఘటనలో అసువులు బాసిన కుటుంబాలకు, ఉగ్రమూకలతో, వీరోచిత పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వీరులకు ఘనంగా నివాళులు అర్పిద్దాం.
Also Read: అర్జున్ టెండూల్కర్‌కు ముంబై టాటా…? మరో నలుగురు ఆటగాళ్లకు రాంరాం..!
WATCH: