ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో (Kothagudem) రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ (BRS) నుంచి వనమా వెంకటేశ్వరరావు పోటీ చేస్తుండగా.. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ సపోర్ట్ తో సీపీఐ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బరిలో ఉన్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ సీటును వదులుకోవడంతో ఇన్నాళ్లూ ఆ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన యెడవెల్లి కృష్ణ బీఆర్ఎస్ లో చేరిపోయారు. బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఆ పార్టీని వీడిన జలగం వెంకట్రావు (Jalagam Venkatrao) ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున సింహం గుర్తుపై బరిలో ఉన్నారు. ఎలాగైనా కొత్తగూడెంలో విజయం సాధించాలన్న లక్ష్యంతో వెంకట్రావు వ్యూహాలు రచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: TS Elections: మంత్రి సత్యవతి రాథోడ్ పై కేసు.. ఎన్నికల ప్రచారంలో మంత్రి ఏం చేశారంటే?
తాజాగా పొంగులేటి ప్రధాన అనుచరుడు గోపాలరావు జలగంకు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. వెంకట్రావు సోదరుడు ప్రసాద్ రావు గోపాలరావుతో జరిపిన చర్చలు సఫలం కావడంతో కలిసి పనిచేసేందుకు గోపాలరావు అంగీకరించినట్లు సమాచారం. గోపాలరావు కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశించి భంగపడ్డారు. అయితే పొత్తులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం కేటాయించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో గోపాలరావును చేర్చుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం కూడా తీవ్రంగా ప్రయత్నించింది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా?.. కాంగ్రెస్‌పై కవిత ఫైర్..
మంత్రి హరీష్ రావ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఆయనతో చర్చలు జరిపారు. కానీ ఆ పార్టీలోకి వెళ్లేందుకు గోపాలరావు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం జలగం వెంకట్రావుతో కలిసి పని చేసేందుకు ఆయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. రాజీనామా తర్వాత జలగం వెంకట్రావుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.