Telangana Elections 2023: ఎవడైనా సరే కొనేద్దాం.. ఈ ఎన్నికల్లో రేట్లు ఎంతో తెలుసా?

తెలంగాణలో ఎన్నికల సీజన్ మొదలైంది. ఖరారైన అభ్యర్థులు ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో గ్రామ, మండల స్థాయిలో పలుకుబడి ఉన్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. మండల స్థాయి నేతలకు రూ.20 లక్షల నుంచి రూ. 50 లక్షలు, గ్రామస్థాయి నేతలకు రూ.5 నుంచి 10 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారన్న చర్చ నియోజకవర్గాల్లో సాగుతోంది.

New Update
Telangana Elections 2023: ఎవడైనా సరే కొనేద్దాం.. ఈ ఎన్నికల్లో రేట్లు ఎంతో తెలుసా?

ఎన్నికలు దగ్గరపడుతుండడంతో రాష్ట్ర రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఈసారి ఎలాగైనా విజయం సాధించేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బలమైన అభ్యర్థులను రంగంలోకి దించుతున్నాయి. ఏం చేసైనా సరే విజయం సాధించుకురావాలని అభ్యర్థులకు టార్గెట్లు విధించాయి. అవసరమైతే ఆర్థికంగా అండదండలు అందించేందుకు కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే ఎన్నికలు వచ్చాయంటే డబ్బు లేకుండా ఏ పనీ జరగదన్న సంగతి తెలిసిందే. నామినేషన్లు వేసి ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్‌ ముగిసేంత వరకు కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఇప్పటివరకు టికెట్ల కోసం నానా తంటాలు పడ్డ ఆయా పార్టీల అభ్యర్థులు ఇక ముందు చేయాల్సిన వాటిపై ఇప్పటినుంచే దృష్టిసారించారు. తమ నియోజకవర్గంలో ఉన్న ఇతర పార్టీలకు చెందిన మండల స్థాయి నుంచి గ్రామస్థాయి నేతల వరకూ చోటామోటా నేతలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Telangana Elections 2023: బీసీ నేతలను కాంగ్రెస్ విస్మరించిందా?

ఒక్కో నేతకు ఒక్కో రేటు..
ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఇప్పటికే 80 శాతానికి పైగా అభ్యర్థులను ప్రకటించాయి. అలాగే బీజేపీ కూడా సగం మంది అభ్యర్థులను ప్రకటించింది. సీటు దక్కిన నేతల్లో కొందరు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతుండగా మరికొందరు రేపటి నుంచి పర్యటనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని ముఖ్య నేతలు ఎవరు? వారు ఏ పార్టీల్లో ఉన్నారు..? అన్నది ఆరా తీస్తున్నారు. దీంతో పాటు గ్రామాల వారీగా బలమైన నేతలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీల లిస్టును తయారుచేస్తున్నారు. వారిలో వీలైనంత మందిని తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. అవసరమైతే కండువా కప్పి పార్టీలోకి చేర్చుకోవడం.. లేదంటే తమ పరిధిలోని ఓట్లను వేయించేలా విశ్వసనీయ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మండల స్థాయి నేతలైతే రూ.20 నుంచి రూ. 50 లక్షల వరకు బేరాలు చేస్తున్నారు. ఇక గ్రామస్థాయి నేతలకు రూ.5 నుంచి 10 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గత పదిరోజులుగా పలు జిల్లాల్లో ముందే అభ్యర్థిత్వం ఖరారు చేసుకున్న నాయకులు ఇలాంటి చేరికలను భారీ ఎత్తున జరిపినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: TDP: చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీలో నాయకత్వ సంక్షోభం!

కుల, కార్మిక సంఘాలతో చర్చలు..
రాష్ట్రంలోని పలు జిల్లాలు, నియోజకవర్గాల్లో కుల సంఘాలు, కార్మిక సంఘాలు కీలకపాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. పలు విషయాలపై వీరంతా ఉమ్మడిగా సమావేశమై తమ సమస్యలు పరిష్కరించమంటూ నేతలకు వినతులు సమర్పించిన సంఘటనలూ కోకొల్లలు. వీరంతా తమ నాయకుల మాటలను తూచ తప్పకుండా పాటిస్తారు. తేడా వస్తే వ్యతిరేకంగా పనిచేయడంలోనూ ముందుంటారు. ఈ నేపథ్యంలో పార్టీల అభ్యర్థులు తమ జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి కుల సంఘాల నేతలను తమ వైపు తిప్పకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయా సంఘాలను నేరుగా కలవడమో, లేదా రహస్య ప్రదేశాల్లో కలిసి మంతనాలు జరుపుతున్నారు. నియోజకవర్గంలో ఆయా కులాల బలాలను బట్టి బేరసారాలు జరుపుతున్నారు. ఎక్కువ ఓట్లు ఉన్న కులాలకు భారీ మొత్తంలో నజరానాలు సమర్పించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుని తమకు మద్దతుగా మలుచుకుంటున్నారు. రూ.1 లక్ష నుంచి ఓట్లను బట్టి రూ.50 లక్షల దాకా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

భంగపడ్డ నేతలకు భారీగా లబ్ధి
ప్రధాన పార్టీల టికెట్ల కోసం ఆయా నియోజకవర్గాల్లో చాలా మంది అభ్యర్థులు టికెట్లు ఆశించిన సంగతి తెలిసిందే. ఒక్కోచోట దాదాపు 5 నుంచి 10 మంది దాకా సీటు కోసం ప్రయత్నాలు జరిపారు. ఈ నేపథ్యంలో సీటు రాని కొందరు సైలెంట్‌గా ఉంటే మరికొందరు మాత్రం వేరే పార్టీలు ఇచ్చే హామీలను బట్టి ఆయా పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సీటు రాక భంగపడ్డ నేతలను తమవైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీల జిల్లా స్థాయి నేతలు, కుదరకుంటే రాష్ట్రస్థాయి నేతలతో చర్చలు జరుపుతున్నారు. గెలిస్తే నామినెటెడ్‌ పదవులిప్పిస్తామని హామీలిస్తున్నారు. అది కుదరకుంటే స్థలాలు, భూములు, భారీగా నగదు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల స్థాయిని బట్టి కోట్లలో బేరాలు జరుగుతున్నట్లు సమాచారం. అంత పెద్దగా ప్రాధాన్యత లేని నేతలకైతే రూ.1 కోటి వరకు బేరమాడుతున్నట్లు తెలిసింది. అలాగే పోటాపోటీ స్థానాలు.. బలమైన అభ్యర్థులున్న చోట్ల మాత్రం భారీ స్థాయిలో (రూ. 1 కోటి నుంచి 10 కోట్లు) నజరానాలు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు