FIR On ChandraBabu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. చంద్రబాబుతోసహా మరో ఇద్దరు మాజీ మంత్రులు, 20మంది నాయకులపై అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1 గా టీడీపీ అధినేత చంద్రబాబును చేరుస్తూ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆయనతోపాతు ఏ2గా దేవినేని ఉమామహేశ్వరరావు, ఏ3గా అమర్‌నాథ్ రెడ్డిని చేర్చారు.
చంద్రబాబు నాయుడు మీద ఐపిసీ 120b, 147, 148,153, 307, 115, 109, 323, 324, 506 r/w 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 గా చంద్రబాబు పేరును చేర్చారు. అన్నమయ్య జిల్లా ముదివీడు పీఎస్‍లో కేసు నమోదు చేశారు. చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు.
ఐదు రోజుల క్రితం చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరి పర్యటన సందర్భంగా ఘర్షణ జరిగింది. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు వద్ద జరిగిన అల్లర్లు, చిత్తూరు జిల్లా పుంగనూరులో (Punganuru) జరిగిన అల్లర్లపై పోలీసులుకు ఫిర్యాదులు అందాయి.
దీంతో కేసులు నమోదు చేసిన చంద్రబాబుతో పాటు టీడీపీ లీడర్లను నిందితుల జాబితాలో చేర్చారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు ప్రసంగించారంటూ ఏఫ్ఐఆర్‌లో పోలీసులు నమోదు చేశారు.
మంగళవారం రాత్రి ముదివేడు పోలీసుల స్టేషన్‌లో ఏ1గా చంద్రబాబు (Chandrababu As A1), ఏ2గా దేవినేని ఉమా, ఏ3గా అమర్‌నాథ్ రెడ్డి, పులివర్తి నానితో పాటుగా మరికొంత మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో చంద్రబాబుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు చేశారు.
అంగళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులో మొత్తం 245 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఇందులో ఇప్పటి వరకూ 74 మందిపై పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ అల్లర్లకు టిడిపి నాయకులే కారణమంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా టిడిపి నేతలైనా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్‌నాథ్ రెడ్డి, చల్లా బాబు(రామచంద్రారెడ్డి), పులివర్తి నానిపై కేసులు నమోదు చేశారు.
ఉమాపతిరెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈనెల 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలు వంటి వాటితో ప్రయాణిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఉమాపతిరెడ్డి. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు 307 సెక్షన్ కింద హత్యాయత్నం, 120బీ సెక్షన్ కింద నేరపూరిత కుట్ర చేసినట్టు అందులో పేర్కొన్నారు.
మొత్తం ఇప్పటి వరకూ ఏడు చార్జ్‌షీట్‌లు నమోదు చేయగా ఇందులో ప్రధాన నిందితుడిగా ఏ1 ముద్దాయిగా చల్లాబాబు అలియాస్ రామచంద్రారెడ్డిని చేర్చారు. మంగళవారం రోజు మరో రెండు కేసులు నమోదు చేశారు. చిత్తూరు సీసీఎస్ కానిస్టేబుల్ ఆర్ లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ చల్లాబాబుతోపాటు చౌడేపల్లి, పులిచెర్ల మండలాలతోపాటు అన్నమయ్య జిల్లా, రాజంపేటకు చెందిన 47 మందిపై కేసులు నమోదు చేశారు.
అనంతపురానికి చెందిన మరో ఏఆర్ కానిస్టేబుల్ రణధీర్ ఫిర్యాదు మేరకు చల్లా బాబుతో పాటు, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి నియోజవర్గానికి సంబంధించిన 39 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో మొత్తం కేసుల సంఖ్య 7కు చేరుకుంది. మొత్తం 7 కేసుల్లో ఏ 1గా పుంగనూరు టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పై ఎఫ్ఐఆర్ దాఖలైన క్రమంలో మొత్తం 7 కేసుల్లో 246 మంది టీడీపీ శ్రేణులపైన కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు 74 మందిని అరెస్ట్ చేసి, అందులో 61 మందిని కడప సెంట్రల్ జైలుకు తరలించగా, మిగిలిన వారిని చిత్తూరు సబ్ జైలులో ఉంచారు.
మరోవైపు పుంగనూరు ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఏ1గా ఉన్న పంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా బాబు ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే టీడీపీ శ్రేణులు పోలీసులపై దాడులు చేశారని చల్లా బాబు పీఏ గోవర్ధన్ రెడ్డి తెలిపినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
Also Read: నాపైనే హత్యాయత్నం చేసి.. నాపైనే కేసు పెడతారా: చంద్రబాబు ఫైర్