Fake Medicines: జ్వరమొస్తే ఆస్పత్రికి వెళ్తాం.. అక్కడ ట్యాబ్లెట్ ఇస్తే తీసుకోని ఇంటికొస్తాం.. టెంపరేచర్ తగ్గడం కోసమని ఆ మందు బిల్లను వేసుకుంటాం.. అయితే ఆ ట్యాబ్లెట్ వల్ల జ్వరం తగ్గకపోగా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎప్పుడైనా ఊహించారా? అమ్మో ఊహించుకుంటేనే భయంగా అనిపిస్తుంది కదు.. నకిలీ వార్తలు, నకిలీ బంగారం, నకిలీ మనుషుల గురించి తెలుసు కానీ రోగాన్ని నయం చేసే మందులే నకిలీవిని తెలిస్తే ఏం చేయాలి? ఇలాంటి దుస్థితి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా? కానీ వచ్చింది.. అక్కడెక్కడో పొరుగు రాష్ట్రాల్లో కాదు.. మన తెలుగు రాష్ట్రాల్లోనే.. ముఖ్యంగా తెలంగాణలో..! రెండు నెలలగా నకిలీ మందులపై అధికారులు నిఘా పెట్టారు. చాలా చోట్లా రైడ్స్ చేశాడు.. లక్షలాది మందు బిల్లలను.. కోట్లు విలువ చేసే మందు సామాగ్రిని గుర్తుంచారు. ఇది విన్న జనానికి నిద్ర పట్టని పరిస్థితి. రోగం వస్తే లక్షలకు లక్షలు తగలేసినా కొనుగోలు చేసింది నకిలీ మందో.. అసలైన మెడిసనో తెలియని దుస్థితి దాపరించింది.
అసలు డౌట్ రాకుండా...:
మెగా లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో ఫేక్ మందులు మార్కెట్లు తిష్టవేశాయి. పేరు చూడటానికి ఏదో ఫార్మా కంపెనీకి చెందినట్టే అనిపిస్తున్నా ఇది పక్కా ఫేక్. ఈ కంపెనీ పేరుతో వచ్చే మందులను అసలు కొనుగోలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇలా ఫార్మా కంపెనీలే అని అనిపించే పేర్లతో మార్కెట్లలోకి మందులు లక్షల్లో వచ్చి చేరుతున్నాయి. గత నెలలో హైదరాబాద్ మలక్‌పేట్‌లో ఉన్న మెడిసిన్ షాప్‌పై పోలీసులు రైడ్ చేశారు. ఆ దాడుల్లో ‘ఎంపీఓడీ-200’ పేరుతో యాంటీబయాటిక్ అని తప్పుగా ముద్రించిన ట్యాబ్లెట్స్ దొరికాయి. ఇలాంటి ఫేక్‌వి మొత్తం రూ.7.34 లక్షలు మందు బిల్లలు దొరికాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో ఈ ముఠా మెగా లైఫ్‌సైన్సెస్ పేరుతో మందులు తయారు చేసి మార్కెట్‌లోకి వదులుతోంది. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. చాక్ పౌడర్, గంజిని ఉపయోగించి ఈ ఫేక్ మందులను ముఠాలు తయారు చేస్తున్నాయి.
చావుతో వ్యాపారామా?
వైద్యుడు భగవంతుని స్వరూపమని, ఔషధాన్ని ప్రాణదాత అని అంటారు. వ్యాధుల కట్టడికి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి మందులను అభివృద్ధి చేస్తారు. ఒక మందు బిల్లకు సంబంధించిన ఫార్ములాను తయారు చేసేందుకు ఎంతో కఠినమైన పరిశోధన చేయాల్సి ఉంటుంది. దీనికి ఏళ్లు పడుతుంది. వీటి కొనుగోలుకు సామాన్యులు వేలు, కొన్నిసార్లు లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇంత పెట్టి కొనిన తర్వాత ఆ మందు నకిలీదని తేలితే?
సిగ్గు లేదా?
నకిలీ మందులను తయారు చేయడమంటే హత్యతో సమానం. ఎందుకంటే రోగాన్ని నయం చేసేది మందులే. ఆ రోగం నయం కాకుండా ఆపేది నకిలీ మందులే. ఇలా ఒకరి మరణానికి ఈ ఫేక్‌గాళ్లు కారణం అవుతున్నారు. ఇలా ప్రజలను చంపేసి మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారా? మరణానంతరం సంపాదించిన డబ్బుతో కొన్న తిండి గొంతులోకి దిగుతుందా? ఎవరైనా మీకు ఇష్టమైన వారికి ఇలా జరిగితే మీరు ప్రశాంతంగా జీవించగలరా? ఇంత జరిగినా మీకు సిగ్గు లేదా? మృత్యువుతో వ్యాపారమా? సిగ్గుపడండి...!
క్యాన్సర్‌ను కూడా వదల్లేదుగా:
ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ ఇటివల నకిలీ మందుల పెద్ద రాకెట్‌ను ఛేదించింది. క్యాన్సర్ మందులు, కీమోథెరపీ, చౌక చికిత్సల పేరుతో ప్రజలను మోసం చేసే రాకెట్ ఇది. అయితే ఇలా చేసేవారికి సహాయం చేస్తుంది ఎవరు? ఈ రాకెట్ ఎంత కాలంగా జరుగుతోంది? మృత్యువును అమ్మే ఈ వ్యాపారానికి సూత్రధారి ఎవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. అయితే క్యాన్సర్ లాంటి మహమ్మారి సోకితే జీవితమే తలకిందులవుతుంది. కుటుంబాలు కూలిపోతాయి. ఆర్థికంగా చితికిపోతాయి.. బాధిత కుటుంబాలు మానసికంగా మనో వేదనకు గురవుతాయి. ఇన్ని తెలిసి కూడా క్యాన్సర్ మందులపై గడ్డి తింటున్నారంటే ఈ ఫేక్‌గాళ్లని ఎలాంటి శిక్షాలు పడాలో ప్రభుత్వాలే నిర్ణయించాలి. ప్రజల నిస్సహాయతను ఆదాయ వనరుగా భావించే కొంతమంది వ్యాపారులు మరణంతోనే ఆటలాడుతుండడం ఘోరం!
నకిలీ మందులను ఎలా గుర్తించాలి?
మెడికల్ స్టోర్ నుండి మందులను కొనుగోలు చేసేటప్పుడు నిజమైన మందులపై QR కోడ్ ముద్రించి ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ కోడ్‌లో ఔషధం గురించి పూర్తి సమాచారం ఉంటుంది. మీరు ఔషధం కొనుగోలు చేసినప్పుడల్లా దానిపై ఈ కోడ్ ఉందో లేదో చెక్ చేయండి. ఔషధంపై క్యూఆర్ కోడ్ లేకపోతే అది నకిలీ ఔషధం కావచ్చు. మీరు అలాంటి మందులను కొనకుండా ఉండాలి. నిబంధనల ప్రకారం రూ.100 కంటే ఎక్కువ ఖరీదు చేసే అన్ని మందులపై క్యూఆర్ కోడ్ తప్పనిసరి. ఇక మందుల ప్యాకేజింగ్ సరిగ్గా ఉందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. బ్రాండెడ్ కంపెనీలు ప్యాకేజీంగ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తాయి. ఒకవేళ మీరు గతంలో కొనుగోలు చేసినదాని కంటే తక్కువ ధరకు మందులు కొనుగోలు చేసి ఉంటే అనుమానపడవచ్చు. మిగిలిన షాపుల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. నకిలీ మందులు గుర్తిస్తే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ టోల్ ఫ్రీ నంబర్ 1800599696 కు సమాచారం ఇవ్వండి.
Also Read: వంతెన నిర్మాణం కోసం నిధులు విడుదల చేసిన అమెరికా..