Ananthapuram: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి వైసీపీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది రోజురోజుకూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ కీలక నేతలు అసమ్మతి సమావేశం నిర్వహించడం నియోజకవర్గ వైసీపీలో కాక రేపుతోంది. ఈ అసమ్మతి సమావేశానికి వైసీపీ సీఈసీ సభ్యులు సోమశేఖర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయ భాస్కర్ రెడ్డి అసమ్మతి సమావేశానికి సారథ్యం వహించారు.
Also Read: ప్రియురాలిపై విషప్రయోగం చేసిన ప్రియుడు అరెస్ట్..!
సొంత పార్టీ కార్యకర్తలనే..
సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడించి తీరుతామని తేల్చి చెబుతున్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గ నలుమూలల నుండి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వచ్చారు. శ్రీధర్ రెడ్డికీ టికెట్ ఇవ్వకూడదంటూ తీర్మానం చేశారు. జగనన్న ముద్దు శ్రీధర్ రెడ్డి వద్దు నినాదాలతో హోరెత్తించారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్యకర్తలను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. సొంత పార్టీ కార్యకర్తలనే ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: సచివాలయ సిబ్బందిపై వైసీపీ నాయకుడి దాడి.. ఫర్నిచర్ ధ్వంసం చేసి రచ్చ.. రచ్చ..!
అవినీతి అక్రమాలే..
శ్రీధర్ రెడ్డి స్వార్థపూరిత రాజకీయాలతో పెద్ద ఎత్తున తన అనుచరులకు భూములు కట్ట పెట్టాడని, పైసలు ఇవ్వందే ఆయన ఏ పని చేయరని అసమ్మతి నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. ఆయనకు టికెట్ ఇస్తే 50 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోవడం ఖాయమన్నారు. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కి లేని వ్యతిరేకత శ్రీధర్ రెడ్డికి ఉందన్నారు. అవినీతిలో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో శ్రీధర్ రెడ్డి ఉన్నాడని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు టికెట్ ఇస్తే వైసీపీలో ఎవరు సహకరించే పరిస్థితి లేదన్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్న ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకొని సీఎం జగన్ కు కానుకగా ఇస్తామన్నారు. ఆయనను మారిస్తేనే పార్టీ బతుకుతుందని ముక్తకంఠంతో నాయకులు పేర్కొన్నారు.