Change in Politics: స్టాలిన్..నవీన్ పట్నాయక్..చంద్రబాబు కొత్త అడుగులు.. మారుతున్న రాజకీయ సంప్రదాయాలు

రాజకీయ నాయకుల్లో మార్పు వస్తోంది. సాధారణంగా నేతల్లో కనిపించే ఈగో తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చూస్తే ప్రజల మంచి కోసం తగ్గి నెగ్గాలని ప్రయత్నిస్తున్నారనిపిస్తోంది. ఎందుకు అలా అనిపిస్తోందో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే

Change in Politics: స్టాలిన్..నవీన్ పట్నాయక్..చంద్రబాబు కొత్త అడుగులు.. మారుతున్న రాజకీయ సంప్రదాయాలు
New Update

Change in Politics: మార్పు.. కచ్చితంగా కావలసిందే.. రావలసిందే. రావడం లేటు కావచ్చేమో కానీ.. తప్పనిసరి. అది వ్యక్తిగతంగా నైనా. సామాజికంగా అయినా.. రాజకీయాల్లో అయినా సరే! ఒక్కోసారి వచ్చే మార్పులు చూస్తే ఆశ్చర్యం వేయడం మాత్రమే కాదు చాలా సంతోషం కూడా అనిపిస్తుంది. ఇది మన మంచి కోసమే వచ్చిన మార్పు అనిపిస్తుంది. అలా అని ప్రతి మార్పు మంచినే తెస్తుందని చెప్పలేం. కానీ, ఇటీవల రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పు చూస్తే కచ్చితంగా ఇది మన మంచికే అనిపిస్తోంది. 

గతం..

Change in Politics: ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అక్కడ అధికార పార్టీ ఓడిపోయింది. అప్పటివరకూ ఉన్న ప్రతిపక్షం అధికారానికి వచ్చింది. ఆర్భాటంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమానికి దేశ రాజకీయాల్లో తలపండిన నాయకులు.. ప్రముఖులు అందరూ హాజరయి కొత్త ప్రభుత్వానికి.. దాని అధినేతకు శుభాకాంక్షలు చెప్పారు. కానీ, ఓటమి పాలైన.. అంతవరకూ అధికారాన్ని అనుభవించిన నేతకు.. ఆ పార్టీ నాయకులకు అహం అడ్డు వచ్చింది. వారు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. నిన్నటి వరకూ మనం చూసింది ఇదే. 

ఒక రాష్ట్రంలో ఎన్నికల్లో అధికార పక్షాన్ని ప్రజలు తిరస్కరించారు. ప్రతిపక్షానికి పట్టం కట్టారు. బాధ్యతలు తీసుకోగానే ప్రభుత్వంలో పాత ప్రభుత్వ నాయకుల ముద్ర చెరిపివేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల బుల్డోజర్లు యుద్ధప్రాతిపదికన పనిచేశాయి. మరి కొన్ని చోట్ల పెయింటర్స్ అహోరాత్రులు శ్రమించారు. ప్రింటింగ్ అయి సిద్ధంగా ఉన్న స్టేషనరీని మూలన పడేశారు. పాత నాయకుడిని మొత్తంగా చెరిపేశామని సంబర పడ్డారు. దీనివెనుక వృధా అయిన ప్రజాధనం విషయం.. ప్రజలకు కలిగిన అసౌకర్యం ఎవరికీ కనిపించలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న అహంకారమో.. పక్క పార్టీ వాడు చేసిన మంచి ప్రజలకు కనిపించకూడదనే భావనో కానీ.. మొన్నటి వరకూ ఇలాంటి దృశ్యాలనే చూస్తూ వచ్చాము. 

ప్రస్తుతం.. 

సీన్ 1..

Change in Politics: తమిళనాడు రాష్ట్రం.. పాత ప్రభుత్వం పోయి స్టాలిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కొన్ని రోజుల క్రితం. ఒక కార్యక్రమానికి సంబంధించి రివ్యూ జరుగుతోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఆయన పార్టీ నాయకులు.. ఆ కార్యక్రమంలో పాత ముఖ్యమంత్రి ఆనవాళ్లు ఉన్నాయి. దీనిని మార్చేయాలని చెప్పారు. దానివలన కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి. ఈ లెక్కలను చూసిన స్టాలిన్ ఆ మార్పునకు అంగీకరించలేదు. పేరు ఎవరిదైతేనేం.. ప్రజలకు మేలు జరుగుతుంది కదా.. లైట్ తీసుకోమని తన పార్టీ నాయకులకు చెప్పేశారు.

సీన్ 2..

Change in Politics: ఒడిశా రాష్ట్రం.. రెండు దశాబ్దాల పాటు రాష్ట్రంలో తిరుగులేకుండా ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ తరఫున మోహన్ చరణ్ మాంఝి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. అయితే, దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా కార్యక్రమానికి వచ్చారు. ముఖ్యమంత్రిని ఆప్యాయంగా పలకరించారు. అభినందనలు తెలిపారు. అంతేకాదు.. ప్రధాని మోదీతో పాటు అక్కడకు వచ్చిన ప్రతి బీజేపీ నాయకులను కూడా కలిసి మాట్లాడారు. కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. రొటీన్ కు భిన్నంగా.. ఇగోలను పక్కన పెట్టి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న తరుణంలో మొహం చాటేశే ఓటమి చెందిన నాయకుల్లా కాకుండా నవీన్ పట్నాయక్ చేసిన ఈ పని ఇప్పుడు దేశవ్యాప్తంగా జేజేలు కొట్టించుకుంటోంది. 

సీన్ 3..

Change in Politics: ఆంధ్రప్రదేశ్.. వైనాట్ 175 అంటూ ఎన్నికలకు సిద్ధం అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గట్టి ఝలక్ ఇచ్చారు ఏపీ ప్రజలు. కేవలం 11 స్థానాలిచ్చి సరిపెట్టుకోమన్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 సీట్లిచ్చి ఘనంగా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు మద్దతు ఇచ్చారు. కూటమి తరఫున ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడకు కూడా ప్రధాని మోదీతో పాటు అతిరథ మహారధులు అందరూ వచ్చి కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పటిలానే మాజీ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ నేతలు కార్యక్రమానికి దూరంగానే ఉండిపోయారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే, ఆయన దగ్గరకు ఒక సమస్య వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులకు జగనన్న విద్యాకానుక పేరుతో ఒక కిట్ ను ఇవ్వడం గత ప్రభుత్వం చేస్తూ వచ్చింది. ఆ కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే, ఆ కిట్ పై జగన్మోహన్ రెడ్డి ఫోటో ప్రింట్ అయి ఉంది. ఇప్పటికిప్పుడు ఆ కిట్స్ మార్చడం కష్టం. పైగా బోలెడంత ఖర్చుతో కూడిన పని ఏమి చేయాలో అర్ధం కాక అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. దానికి చంద్రబాబు విద్యార్థులకు ఏమాత్రం ఆలస్యం కాకుండా విద్యా కానుక పంపిణీ చేయాలని.. ఫోటో ఎవరిదైతే ఏమి? విద్యార్థులకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పారని వార్తలు వచ్చాయి. 

Change in Politics: మార్పు మంచికోసమే అనే మాట ఈ మూడు ఉదంతాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే మార్పు కొనసాగితే.. ప్రజల జీవితాల్లో మంచి మార్పులు ఎన్నో వస్తాయి. రాజకీయ నాయకులు.. నేతలు అహాన్ని పక్కన పెట్టి వ్యవహరిస్తే బోలెడు ప్రజాధనాన్ని సేవ్ చేసినవారవుతారు. మంచి జరుగుతుంది అనుకున్నపుడు ఒక అడుగు తగ్గితే పోయేదేం ఉండదు. అదేదో సినిమాలో చెప్పినట్టు తగ్గడం కూడా ఒక్కోసారి నెగ్గడమే అవుతుంది. ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకుంటే, తమను తాము తగ్గించుకుంటే.. తరువాత ప్రజల దృష్టిలో వారు హెచ్చింపబడతారు, మరి మీరేమంటారు?

#change #politics
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe