కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దుర్గ్‌లో ర్యాలీ నిర్వహించి భూపేష్ బఘేల్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. భిలాయ్‌ను మినీ ఇండియాగా పరిగణిస్తున్నారని అమిత్ షా అన్నారు. ఎన్నికల సమయంలో పది లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ. 2,500 భ్రుతి కల్పిస్తామని హామీ ఇచ్చి మరిచిన సంగతిని గుర్తు చేస్తూ అమిత్ షా మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ముఖ్యమంత్రికి సిగ్గుండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలవడం ఖాయమని ధీమావ్యక్తం చేశారు అమిత్ షా.
గత 9 ఏళ్లలో మోడీ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని షా అన్నారు. సోనియా-మన్మోహన్ ప్రభుత్వం పదేళ్లపాటు కొనసాగింది. స్కామ్‌లు, కుంభకోణాలు, అవినీతి ఈ పదేళ్లలో మాత్రమే జరిగాయి. 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది కాంగ్రెస్. మోడీ తన 9 ఏళ్ల పాలనలో ప్రతిపక్షాలు కూడా అవినీతి ఆరోపణలు చేయలేని పారదర్శక ప్రభుత్వాన్ని నడిపారు. కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి చొచ్చుకువచ్చారని..మోడీ పాలనలో ఒక్క టెర్రరిస్టు కూడా ఇండియాలోకి లేదన్నారు. అసలు కాంగ్రెస్ ప్రజల ప్రాణాలంటే లెక్కలేదన్నారు. కానీ మోడీ సర్జికల్ స్ట్రైక్ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పారన్నారు. దేశానికి మూడోసారి కాబోయే ప్రధాని మోడీయేనని ధీమా వ్యక్తం చేశారు. అటు రాహుల్ గాంధీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు అమిత్ షా.