తెరపైకి బీసీ నినాదం..
ఈ మధ్య కాలంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మరోసారి పొలిటికల్ ఎంట్రీపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. బీసీ నినాదం తెర మీదకి తెచ్చిన ఆయన కొత్తగూడెం సీటు బీసీలకి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లు ఉండగా 7 సీట్లు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారని.. మిగిలిన జనరల్ స్థానాల్లో మీరే పోటీ చేస్తున్నారు కదా అని ప్రశ్నించారు. మళ్లీ కొత్తగూడెం ఎందుకు అడుగుతున్నారని నిలదీశారు. కొత్తగూడెంలో ఏడాదిన్నరగా జీఎస్‌ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకి సేవలు అందిస్తున్నా పేర్కొన్నారు. కొత్తగూడెం సెగ్మెంట్‌ని నయా కొత్తగూడెంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని గడల వెల్లడించారు.
బుల్లెట్ దిగిందా? లేదా?
కార్మికులు, యువకులు , మహిళలు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. యువత రాజకీయాల్లోకి రావడం కోసం యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. చాలా మంది గిట్టనివాళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గంలో శని, ఆదివారాలు మాత్రం ఉంటేనే మీరు తట్టుకోలేకపోతున్నారని.. ఇక 365 రోజులు ఉంటే మీ పరిస్థితి ఏంటని సెటైర్లు వేశారు. ఎప్పుడూ వచ్చాం అని కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని వివరించారు. వాటిని ఎవరు పట్టించుకుటారో వారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాటు చేసిన జీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కాళ్లు మొక్కిన డీహెచ్..
గతంలో ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ వర్చువల్ ద్వారా రాష్ట్రంలో ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సమయంలో ఆయన కాళ్లకు శ్రీనివాసరావు మొక్కారు. దీంతో ఉన్నత అధికారి స్థానంలో ఉన్న ఆయన ఇలా చేయడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపాయి. అప్పటినుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. టికెట్ కోసమే కేసీఆర్ కాళ్లకు మొక్కారని ట్రోల్స్ జరిగాయి. ఆ సమయంలోనే పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అప్పుడే స్పష్టంచేశారు. ప్రస్తుతం వనమా వెంటకేశ్వరరావు ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో శ్రీనివాసరావుకు లైన్ క్లియర్ అయినట్లేనని గులాబీ వర్గాలు చెబుతున్నాయి. మరి గులాబీ బాస్ శ్రీనివాసరావుకి కొత్త గూడెం సీటు ఇస్తారా? లేదా మరికొన్ని రోజులు వేచి చూడాలి.