తిరుమలలో గురువారం రాత్రి చిన్నారిపై చిరుత దాడిచేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో చిన్నారి క్షేమంగా బయటపడ్డాడు. చిన్నారి కౌశిక్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. చిరుత ఏడాదిన్నర కూన కావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. నోటితో కరిచి పట్టుకోవడం చిరుతకు రాకపోవడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడన్నారు. చిరుత చిన్నదా కావడంతో బాలుడిని సరిగ్గా పట్టుకోవడం రాలేదని…కాలుతో పట్టుకెళ్లందని..నోటితో పట్టుకోలేకపోవడం వల్లే బాలుడు బతికాడని తెలిపారు. నోటితో కరిస్తే బతికే అవకాశమే లేదన్నారు.
కర్నూలు జిల్లాకు చెందిన నాలుగేళ్ల చిన్నారి కౌశిక్ గా గుర్తించారు. కుటుంబంతో కలిసి తిరుమల అలిపిరి నడక దారిలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడు చిప్స్ కావాలని అడగడంతో రాత్రి తొమ్మిదిగంటల సమయంలో కొనివ్వడానికి తన తాత తీసుకెళ్లాడు. ఆ సయమంలోనే చిరుత దాడి చేసింది. అది గమనించిన బాలుడి తాత, దుకాణం దారులు కేకలు వేస్తూ పులి వెనక పరుగులు పెట్టారు. టార్చ్ లైట్లు వేసుకుని రాళ్లు విసురుతూ..అరుపులు చేయడంతో పోలీస్ ఔట్ పోస్టు దగ్గర బాలుడిని వదిలేసింది. అక్కుడున్న పోలీసులు బాలుడికి ప్రథమ చికిత్స చేశారు.
ఆ తర్వాత పద్మావతి హృదయాలయాలో చికిత్స అందించారు. బాబుకు చెవి వెనుక, మెడ, తలకు గాయలయ్యాయి. కౌశిక్ కు గత అర్ధరాత్రి సిటీ స్కాన్ నిర్వహించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. బలమైన గాయాలు కావని నిర్ధారించారు.