వైనాట్ పులివెందుల.. జగన్‌కు చంద్రబాబు ఛాలెంజ్

'వైనాట్ పులివెందుల' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌కు ఛాలెంజ్ చేశారు. టీడీపీ అభ్యర్థిగా బీటెక్‌ రవిని గెలిపించాలని పులివెందుల ప్రజలను కోరారు. పులివెందులలో చంద్రబాబు పర్యటనకు జనాల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ పర్యటనలో బాబు ప్రసంగం టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం ఇచ్చింది.

New Update
'పెన్నా టు వంశధార'.. ప్రాజెక్టులపై పోరుబాటకు చంద్రబాబు సిద్ధం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కడప జిల్లా పులివెందుల గడ్డపై పొలికేక వేశారు. టీడీపీ నేతలను రెచ్చగొడితే కొదమసింహంలా అణచివేస్తామని వైసీపీ నేతలను హెచ్చరించారు. పులివెందులలో చంద్రబాబు బహిరంగసభకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సభకు జనం ఎంతమంది వచ్చారో సీఎం జగన్ చూడాలి అని హితవుపలికారు. పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోందని అన్నారు. కేంద్రం ఆంధ్రులకు ఇచ్చిన పోలవరాన్ని జగన్ గోదావరిలో కలిపేశారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరిట రూ.5 వేల కోట్లు దోచుకోవాలన్నది జగన్ ప్రణాళిక అని ఆరోపించారు. రాయలసీమ ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చాకే, చెన్నైకి నీళ్లు ఇవ్వాలని ఎన్టీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఎస్ఆర్‌బీసీ ప్రారంభించిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు.

సొంత బాబాయ్‌నే గొడ్డలి వేటు వేసిన వ్యక్తికి మీరు, నేను ఒక లెక్కా అన్నారు. న్యాయం కావాలని పోరాడే పులివెందుల పులి సునీత అన్నారు. తన తండ్రిని చంపిన వ్యక్తి ఎవరని నిరూపించకపోతే తండ్రి ఆత్మకు శాంతి కలగదని, ఆ తల్లి భయపడకుండా పనిచేస్తోందన్నారు. బాబాయిని ఎవరు చంపారో మీకు తెలియదా అని ప్రశ్నించగా అందరూ తెలుసని సమాధానం ఇచ్చారు. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందని.. లేదంటే అధర్మం అందరినీ దహించి వేస్తుందన్నారు. రాజశేఖర్‌రెడ్డి బతికుండగా ఆస్తిలో జగన్, షర్మిలకీ చెరి సగం వాటా అని చెప్పారని, కానీ ఈ ముఖ్యమంత్రి చేశారా? అని ప్రశ్నించగా జనం లేదు.. లేదు అని తెలిపారు. ఇప్పుడు నేను చెబుతున్నా.. వైనాట్‌ పులివెందుల.. బీటెక్‌ రవిని మీకు అప్పగిస్తున్నా గెలిపించాలని పులివెందుల ప్రజలను కోరారు. అలాగే ఏపీ రాజధాని ఏది అని అడగ్గా.. అందరూ అమరావతి అని గట్టిగా కేకలు వేసి మద్దతు పలికారు.

ఇదిలా ఉంటే పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. వివేకా హత్య కేసులో తనను, తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు, సునీతతో పాటు బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు రెండేళ్లుగా కుట్ర పన్నారని ఆరోపించారు. తమ కుటుంబంపై పగ పట్టారని.. ధర్మం తమ వైపే ఉందన్నారు. 14 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న చంద్రబాబు పులివెందులకు ఏం చేశారని అవినాష్ ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, డ్వాక్రా మహిళలను మోసం చేశారని, రైతులకు వెన్నుపోటు పొడిచారని అవినాష్ విమర్శించారు.

మరోవైపు చంద్రబాబు పులివెందుల పర్యటన విజయవంతమైందని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటే.. వైసీపీ శ్రేణులు మాత్రం వింతగా ప్రవర్తించారు. పులివెందుల పూలంగళ్ల సర్కిల్‌లో రోడ్లపై పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభల్లో పూలంగళ్ల సర్కిల్ రోడ్లపై తిరగడాన్ని నిరసిస్తూ పసుపు నీళ్లతో శుద్ధి చేశామని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పసుపు శుభ సూచికం కాబట్టి టీడీపీకి శుభం కలగాలని పసుపు నీళ్లతో శుద్దిచేస్తున్నారని టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు