మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్‌సభ వాయిదా

మణిపూర్ అంశంపై విపక్షాలు ఎప్పటిలాగే పార్లమెంట్ ఉభయ సభలనూ స్తంభింపజేశాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే ప్రతిపక్ష ఎంపీలు.. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని, ప్రధాని మోదీ ప్రకటన చేయాలని నినాదాలు చేశారు. ముఖ్యమైన బిల్లులు పెండింగులో ఉన్నాయని, వీటిపై చర్చించాలన్న లోక్ సభ స్పీకర్ సూచనను వారు పట్టించుకోలేదు. వారి రభసతో సభ మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడింది.

New Update
మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్‌సభ వాయిదా

మణిపూర్ అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వం చర్చ చేపడుతుందని రాజ్యసభలో మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. దూధ్ కా దూధ్..పానీకా పానీ.. అని ఆయన వ్యాఖ్యానించారు. మణిపూర్ పరిస్థితిపై చర్చకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే మీరు 9 రోజులుగా సభా కార్యకలాపాలను స్తంభింపజేశారన్నారు. 267 నిబంధన కింద చర్చ జరగాలని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. విపక్షాల తీరుపై మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడుతూ, మీరు ఏ అంశంపై చర్చ చేపట్టదలచినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాంటప్పుడు పార్లమెంటు సజావుగా నడిచేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పదేపదే ముఖ్యమైన బిల్లుల ఆమోదానికి అడ్డుపడడం తగదని హితవు పలికారు.

ఈ అంశంపై రాజ్యసభలో విపక్షాలు గందరగోళం సృష్టించాయి. ఎంపీలు తమ తమ సీట్లలో కూర్చోవలసిందిగా చైర్మన్ జగదీప్ ధన్ కర్ చేసిన సూచనను పట్టించుకోలేదు. విపక్ష కూటమి 'ఇండియా' కు చెందిన విపక్ష ప్రతినిధుల బృందం మణిపూర్ లో రెండు రోజుల పాటు పర్యటించిందని, వారి వాదనలను పార్లమెంట్‌లో వినిపించేందుకు లోక్ సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ అనుమతించాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రంలోని పరిస్థితిపై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.

వివాదాస్పదమైన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. ఈ బిల్లుకు సంబంధించిన అంశం లిస్టులో లేదన్నారు. మణిపూర్ పరిస్థితిపై అవిశ్వాస తీర్మానాన్ని 10 రోజుల్లో చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లులో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందులో మూడు ముఖ్యమైన అంశాలను తొలగించి ఓ సూచన చేర్చాలని ప్రతిపాదించిందన్నారు.

నిజానికి ఈ బిల్లును హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రవేశపెడతారని ఇది వరకే వార్తలు వచ్చాయి. పైగా ఈ బిల్లు ముసాయిదా ప్రతులను ఎంపీలకు ప్రభుత్వం సర్క్యులేట్ చేసిందని కూడా పేర్కొన్నాయి. అయితే ఇప్పటికే మణిపూర్ ఆంశంపై విపక్షాల నుంచి 'పెను దుమారాన్ని' ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు