ట్వీట్ దుమారం
రాష్ట్ర బీజేపీలో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్న వేళ.. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి సొంత పార్టీ నేతల తీరును విమర్శిస్తూ చేసిన ట్వీట్ దుమారం రేపుతున్నాయి. వాహనంలోకి బలవంతంగా గేదెలు ఎక్కిస్తున్న వీడియోను పోస్టు చేసిన ఆయన.. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమని ట్వీట్ చేశారు. జితేందర్‌రెడ్డి ట్వీట్ ఒక్కసారిగా దుమారం రేపగా ఈ ట్వీట్ దేనికి సంకేతమని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న సమయంలో వెంటనే డిలీట్ చేశారు.
ఆ ట్వీట్‌కు అర్థమేంటో..!
అయితే.. బీజేపీలో జితేందర్‌రెడ్డి ట్వీట్ దుమారంపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆ ట్వీట్‌కు అర్థమేంటో ఆయన్నే అడగాలని ఈటల అన్నారు.ఎవరి స్వేచ్ఛ, గౌరవాన్ని తగ్గించకూడదని.. వయస్సు పెరిగిన కొద్దీ.. ప్రజాజీవతంలో ఉన్నవాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఈటల అన్నారు. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలని మనవి చేశారు. నిన్న దున్నపోతుని తన్నుతూ ట్రాలీలో ఎక్కింటే వీడియోను ట్వీట్ చేసిన జితేందర్‌రెడ్డిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
గొప్పగా చెప్పారు
ఈ క్రమంలోనే ఆయన మరో ట్వీట్ చేశారు. బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే వారికి ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నం చేశానని.. కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వివరణ ఇచ్చారు. జితేందర్‌రెడ్డి చేసిన ఈ ట్వీట్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటను అద్భుత పోలికతో ప్రజలకు వివరించారన్నారు. బీజేపీలో చేరిన వారి పరిస్థితి గురించి ఇంత కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరంటూ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
పార్టీకి తీవ్ర నష్టం
రాష్ట్ర బీజేపీలో పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతున్న వేళ.. జితేందర్‌రెడ్డి ట్వీట్ మరింత చర్చనీయంగా మారింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్న కమలంలో.. నివురు గప్పిన నిప్పులా నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్.. రెండు వర్గాలుగా విడిపోవడం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది.
అసంతృప్తితో సీనియర్లు
ఢిల్లీలో సమావేశం.. దేశంలో నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని చేపట్టి.. బీజేపీ పథకాలను ప్రజల్లోకి వెళ్లి వివరించాలని పార్టీ అధినాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణలో ఈ ప్రచార కార్యక్రమానికి పార్టీ కీలక నేతలైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్ పాల్గొనలేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై సీనియర్‌ల అసంతృప్తి నేపథ్యంలో కిషన్‌రెడ్డి, ఈటల, రాజగోపాల్‌రెడ్డిలను అధిష్ఠానం ఢిల్లీకి పిలిపించింది.
బీఆర్ఎస్‌పై చర్యలు తీసుకోవాలి
పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ ముగ్గురితో అమిత్ షా, నడ్డా సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నికలు, కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ మెత్తపడిందని ప్రజలు భావిస్తున్నట్లు.. అగ్రనేతలకు ఈటల, రాజగోపాల్‌రెడ్డిలు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆ పార్టీ ముఖ్యనేతలపై ఉన్న ఆరోపణల విషయంలో చర్యలు తీసుకుంటేనే బీజేపీపై ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని విస్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ఢీల్లీ మద్యం కేసులో చర్యలు నెమ్మదించడంతో ఎమ్మెల్సీ కవిత విషయంలో బీజేపీ ఉదారంగా వ్యవహరిస్తోందనే ప్రచారం పార్టీకి నష్టదాయకమని వారు ప్రస్తావించినట్లు సమాచారం.