అప్పుల బాధ తాళలేక ఆటో డ్రైవర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో జరిగింది. ఆత్మహత్య దృశ్యాలను సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం తెలుసుకున్న, సహచర ఆటో డ్రైవర్లు ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాలా సుబ్రహ్మణ్యాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందించిన అనంతరం పరిస్థితి విషమించడంతో, మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం విజయవాడ తరలించారు.
సెల్ఫీ వీడియోలో ఆవేదన
చౌదరిపేటలో నివాసం ఉండే సాలా సుబ్రహ్మణ్యం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తనకు అప్పిచ్చిన చౌదరి వేధింపులు తాళలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పిచ్చిన చౌదరికు చెందిన వ్యక్తికి, సుబ్రహ్మణ్యంకు జరిగిన సంభాషణల ఆడియో రికార్డులను కుటుంబ సభ్యులు మీడియాకు అందజేశారు. అధిక వడ్డీలు చెల్లించలేకే సుబ్రహ్మణ్యం ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేస్తున్నారు.