ఆమడ దూరంలో మనిషిని చూడగానే ఉడత తుర్రుమంటుంది.అది సిగ్గో, భయమో,అవతలి వారిమీద గౌరవమో.!లేదా సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవమో..! ఇంత వరకూ ఎవరికీ తెలియదు.అయితే ఎవర్నైనా చూసి ఇంత హైరానా పడే ఉడత తన అవసరం వచ్చినపుడు వెన్ను చూపలేదు. రామ సేతు నిర్మాణంలో తనకంటూ ఓ పేజీ రాసుకుంది.
ఇంత చెబుతున్నామని ఉడత మాకేదో దగ్గర బంధువనుకునేరు.! లేదు లేదు ఉడత ఒక వ్యక్తితో దోస్తీ చేస్తోంది. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన మహ్మద్ వహీద్ అనే వ్యక్తి డ్రైవర్ తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోంది. స్వతహాగా జంతు ప్రేమికుడైన వహీద్ మేకలు, ఆవులు, చిలుకలను పెంచుకుంటున్నారు.
ఒకరోజు మేకలకు మేత తీసుకురావడానికి వెళ్లిన వహీద్కు ఒక చిన్న ఉడత దొరికింది. దానిని ఇంటికి తీసుకొచ్చి పాలు పోసి పెంచాడు. కొద్దీ రోజుల తరవాత మళ్లీ దానిని ఎక్కడ దొరికిందో అక్కడే వదిలి వేయడానికి ప్రయత్నించినా..అది వెళ్లకుండా మళ్లీ అతని దగ్గరకే వచ్చింది.
ఉడత తిరిగి వెళ్లకపోవడంతో ఇంటికి తీసుకొని వచ్చి…దానిని పెంచుకుంటున్నాడు. ఉడత కూడా అతనితో, పిల్లలతో చాలా సరదాగా ఆడుకుంటుంది. అయితే ఆ ఉడత వేరే వ్యక్తి దగ్గరకు వెళ్లడం లేదు. దానికి రోజు పాలు, పండ్లు వంటి ఆహారం ఇస్తున్నారు.
ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేచినప్పటినుంచి.. పడుకునే వరకు ఉడత తమతోనే ఉంటుందని వహీద్ వివరించారు. ఉడత తనతో స్నేహం చేయడం సంతోషంగా ఉందని వహీద్ కుమారుడు అర్హాన్ ఆనందం వ్యక్తం చేశాడు.