Armpits Smell Remover Tips: చాలా మంది చెమట కారణంగా ఇబ్బందులు పడుతుంటారు. చెమట దుర్వాసన ఎదుటి వారిని దూరం చేస్తుంది. ముఖ్యంగా చంకల దుర్వాసన మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విషయంలోనే చాలా మంది అసౌకర్యంగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నారా? అయితే మరేం పర్వాలేదు. ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాస్తవానికి శరీర దుర్వాసనకు చెమట మాత్రమే కారణం కాదు. కొందరికి చెమట పట్టనప్పటికీ.. శరీరం నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంటుంది. చంకల నుంచే కాకుండా.. శరీరంలో తేమ కారణంగా, వెంట్రుల మధ్య బ్యాక్టీరియా పెరగడం కారణంగా ఒక రకమైన దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది డియోడరెంట్స్, ఫౌడర్లను వాడుతుంటారు. అయినప్పటికీ ఆ సమస్య తగ్గదు. అయితే, మీరు కూడా ఇలాంటి సమస్యతోనే ఇబ్బంది పడుతున్నట్లయితే.. అద్భుతమైన చిట్కాను మీకోసం తీసుకువచ్చాం. దీనిని పాటించడం ద్వారా శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. మరి ఆ చిట్కాలేంటో ఓసారి చూసేయండి..
చంకల్లో, శరీరం నుంచి దుర్వాసన రావడానికి ప్రధాన కారణాలు..
» క్యాబేజీ, ఉల్లిపాయ, బ్రోకలీ, వెల్లుల్లితో సహా సల్ఫర్ కలిగిన ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల కూడా శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది.
» స్నానం చేయకపోవడం వల్ల దుర్వాసన వస్తుంది. క్రమం తప్పకుండా స్నానం చేయడం వల్ల దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మక్రిములు శరీరం నుంచి తొలగిపోతాయి. తద్వారా ఫ్రెష్‌గా ఉంటారు.
» వర్కౌట్స్ చేసిన వెంటనే దుస్తులను ఛేంజ్ చేసుకోవాలి. లేదంటే.. చెమట పట్టిన ఆ దుస్తుల కారణంగా కూడా శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది.
దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..
1. వ్యక్తిగత పరిశుభ్రత
వేసవిలో ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేయాలి. ఫలితంగా చెమట, శరీరంపై ఉన్న బ్యాక్టీరియా తొలగిపోతుంది. అలాగే స్నానం కోసం మంచి యాంటీ బాక్టీరియల్ సబ్బును ఉపయోగించాలి. వారానికి ఒకసారి చంకలను ఎక్స్ఫోలియేట్ చేయాలి. తద్వారా చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. స్క్రబ్‌ని అప్లై చేయడం, మీ చంకలకు లూఫా ఉపయోగించడం వల్ల దుర్వాసన సమస్యకు చెక్ పడుతుంది. వదులుగా ఉండే దుస్తులను వేసుకోవాలి. కాటన్, నార దుస్తులను ధరించడం ఉత్తమం. క్రమం తప్పకుండా అండర్ ఆర్మ్స్ షేవ్ చేసుకోవాలి. వెంట్రుకలు అధికంగా ఉండటం వలన చర్మంపై బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
2. డైట్
వెల్లుల్లి, ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రోకలీ వంటి కూరల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. సల్ఫర్ సమ్మేళనాలు కుళ్ళిన గుడ్డు వాసన కలిగి ఉంటాయి. స్కిన్ బాక్టీరియా సల్ఫర్‌తో కలిసినప్పుడు.. శరీరం నుంచి మరింత అసహ్యకరమైన దుర్వాసన విడుదలవుతుంది. అందుకే సల్ఫర్ పదార్థాలను అధికంగా తినకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
3. టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలు, మనోహరమైన సువాసన కారణంగా దీనిని సహజమైన దుర్గంధనాశనిగా ఉపయోగించవచ్చు. టీ ట్రీ ఆయిల్ ఆరోగ్యకరమై, అందమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. శరీరం నుండి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఇది సహజంగా ఆమ్లం కానందున, సున్నితమైన ప్రాంతాలకు కూడా అప్లై చేయొచ్చు. వాసన అలాగే ఉన్నట్లయితే.. ప్రతిరోజూ రెండు లేదా మూడు సార్లు అప్లై చేయాలి.
4. వేప ఆకులు
చర్మంపై వేప రసాన్ని స్ప్రే చేయాలి. కాసేపు అలాగే ఉంచాలి. ఆ తరువాత మంచి నీటితో స్నానం చేయాలి. తద్వారా శరీరం నుంచి వెలువడే దుర్వాసన తొలగిపోతుంది. వేపలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు.. చర్మాన్ని అన్ని విధాలుగా రక్షిస్తుంది. దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చర్మంపై నుంచి తొలగిస్తుంది. తద్వారా శరీర దుర్వాసన తగ్గిపోతుంది.
గమనిక: ఇందులో పేర్కొన్న అంశాలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని ఆర్టీవీలైవ్ ధృవీకరించడం లేదు. తీవ్రమైన సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనల మేరకు చికిత్స తీసుకోవడం ఉత్తమం.
Also Read: Brushing Your Teeth: నిద్రలేచిన తర్వాత బ్రష్ చేయకుండా టైమ్ వేస్ట్ చేస్తే ఏం అవుతుందో తెలుసా?