డీజీపీకి నివేదిక
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నిర్వహించిన ఆందోళనలో సీఐ అంజూ యాదవ్ తీవ్రంగా రియాక్టయిన విషయం తెలిసిందే. నిరసనకారులను అదుపుచేసే క్రమంలో జనసేన లీడర్ కొట్టె సాయిపై ఆమె చేయిచేసుకున్నారు. ఇతర కార్యకర్తలు, అభిమానులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. జనసైనికుల వెన్నంటి ఉంటానని, సీఐ అంజూ యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. సీఐ అంజూ యాదవ్‌కు ఛార్జ్ మెమో జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఇప్పటికే విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
చర్యలు తీసుకోవాలి
తిరుపతి పాత విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అక్కడినుంచి రోడ్డుమార్గం ద్వారా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం లోపలకి పవన్‌తోపాటు మరో ఎనిమిది మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు పోలీసులు. శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకుడు కొట్టే సాయిపై శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ దాడి ఘటన నేపథ్యంలో ఆమెపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వర రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన
పవన్‌తోపాటు బాధితుడు కొట్టేసాయి, జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, శ్రీకాళహస్తి ఇన్‌చార్జి నగరం వినుత, మదనపల్లె ఇన్‌చార్జి రామదాస్ చౌదరితోపాటు అడ్వకేట్లు అమరనారాయణ, కంచి శ్యాములు ఎస్పీని కలిశారు. మరోవైపు ఆమె తీరుపై మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీరించడం, దాడిని తీవ్రంగా ఖండించి.. జనసేన అధినేత కూడా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో సీఐపై చర్యలకు పోలీస్ శాఖ సుముఖంగా ఉన్నప్పటికీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అడ్డుపడుతున్నట్టు తెలియవచ్చింది. ఆమె సేవలు శ్రీకాళహస్తి పట్టణానికి ఎంతో అవసరమని ఈ సమయంలో ఆమెపై వేటువేయడానికి వీల్లేదని అధికార పెద్దలపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.
దాడికి కారణం వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన కామెంట్స్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు, వాలంటీర్లు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు పవన్‌కు మద్దతుగా.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు కూడా శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలోనే జనసేన నేత సాయిపై అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
శాంతియుతంగా ధర్నా చేస్తాం
ఈ ఘటనపై స్పందించిన పవన్.. శాంతియుతంగా ధర్నా చేయడం ప్రజాస్వామ్యంలో హక్కు అని పేర్కొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నవారిని కొట్టే హక్కు ఏ పోలీసు అధికారికి లేదని ఆయన అన్నారు. తానే శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాకు వస్తానని.. అక్కడే తేల్చుకుందామని అన్నారు. తమ వాళ్లను ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. తమ నాయకుడిని కొడితే.. తనను కొట్టినట్టేనని తప్పకుండా అక్కడికే వస్తానని చెప్పారు. పోరాడితే పోయేదేమి లేదు.. బానిస సంకెళ్లు తప్ప అని పవన్ పేర్కొన్నారు. ఎస్పీని కలిసిన అనంతరం పవన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.