ఢిల్లీలో వరదలు ఆందోళన కలిగిస్తున్నాయి. వరదల కారణంగా వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యమునా తీర ప్రాంతాలన్నీ వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. గత కొన్ని రోజులుగా, ఢిల్లీతో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా యమునా నది నీటి మట్టం పెరిగింది. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. అయితే ఆదివారం అర్థరాత్రి యమునా నది నీటిమట్టం ప్రమాద స్థాయికి దిగువకు చేరుకుంది.
సమాచారం ప్రకారం, ఢిల్లీలో యమునా నీటి మట్టం రాత్రి 11 గంటలకు 205.5 మీటర్లుగా నమోదైంది. అయితే మళ్లీ వర్షాలు లేకపోతే నీటి మట్టం తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట పరిసరాలు, మహాత్మాగాంధీ సమాధి వరద నీటిలోనే ఉన్నాయి. కశ్మీర్ గేట్ వద్ద మోకాల్లోతు ఉన్న నీటిలో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మమూర్ విహార్, ఓల్డ్ యమునా బ్రిడ్జ్ ప్రాంతాల్లో చాలా మంది బహిరంగప్రదేశాల్లోనే టార్పాలిన్ కవర్ల కప్పుకుని నిద్రిస్తున్నారు.
ఆదివారం ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరద బాధిత ప్రజలకు సహాయాన్ని ప్రకటించారు. యమునా నది ఒడ్డున నివసిస్తున్న చాలా పేద కుటుంబాలు చాలా కష్టాలు పడుతున్నాయని అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం ప్రకటన చేస్తూ.. వరద బాధిత కుటుంబానికి ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందజేస్తుందని తెలిపారు. దీంతో పాటు ఆధార్ కార్డు తదితర పేపర్లు కొట్టుకుపోయిన వారి కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. మరోవైపు ఈ వరదలో దుస్తులు, పుస్తకాలు కొట్టుకుపోయిన చిన్నారులకు పాఠశాలల ద్వారా వీటిని అందజేయనున్నారు.
దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఢిల్లీలో యమునా నది నీటిమట్టం ఇంత ఎత్తుకు చేరుకుందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, నదిలో నీటిమట్టం పెరగడంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో యమునా తీరంలో ఉన్న ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.