Women Reservation Bill: మహిళల రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుండటంతో దేశవ్యాప్తంగా మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారితే.. దాని వల్ల ఎవరికి లాభం..? దేశ రాజకీయాలు మారనున్నాయా..? త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరుస్తుందా..? ఇందులో మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ కూడా ఉండటంతో రాష్ట్రంలో ఎలాంటి సమీకరణాలు చోటుచేసుకోనున్నాయా..? మహిళలు ఓట్లు బీజేపీకి పడే అవకాశం ఉందా..? గత ఎన్నికల రికార్డులు పరిశీలిస్తే బీజేపీకి మహిళల ఓట్లు గంపగుత్తుగా పడుతున్నాయా..? ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ..
రెండు రోజుల క్రితం మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. OBCలు, మహిళలకు పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలలో 33శాతం రిజర్వేషన్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. బీసీ అభ్యున్నతి, మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. 2014లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్‌కు తీర్మానం చేసినట్లు గుర్తు చేశారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లుపై తీర్మానం పాస్ చేసిన ప్రతిని కూడా ప్రధానికి రాసిన లేఖతో జతపరిచారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కవిత పోరాటం..
మరోవైపు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 47 రాజకీయ పార్టీలకు లేఖలు రాశారు. గతంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ధర్నా కూడా నిర్వహించారు. సీఎం కేసీఆర్ సహా విపక్షాల ఒత్తిడి వల్లే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ముందుకు రాబోతోందని ఇప్పటికే కవిత ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పుడు కేంద్రం పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టనుండటంతో ఎన్నికల్లో ఇది తమ విజయంగా బీఆర్ఎస్ ప్రచార అస్త్రంగా మలుచుకోవచ్చు. తద్వారా మహిళల ఓట్లు తమకు మలుచుకోవచ్చనే ప్లాన్ చేసే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
మహిళ ఓట్లే లక్ష్యంగా బీజేపీ పావులు..
మరోవైపు అదే సమయంలో తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం.. ఈ బిల్లు ఆమోదాన్ని ఎన్నికల ప్రధాన అజెండాగా జనాల్లోకి తీసుకెవెళ్లవచ్చు. ఇప్పటికే మహిళల్లో బీజేపీ పట్ల నమ్మకం ఉంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని మహిళల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగితే వారి ఓట్లు తమకు పడి అధికారం దిశగా అడుగులు వేయవచ్చనే ప్లాన్‌లో ఉన్నారు కమలం నేతలు. మోదీ మేనియాతో ఇటు యువతను మహిళా బిల్లుతో అటు మహిళలను దగ్గర చేసుకునే ప్లాన్‌లో ఉంది కాషాయం పార్టీ.
ఇది కూడా చదవండి: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
ఇక దేశవ్యాప్తంగా గత దశాబ్ద కాలంలో చూసుకుంటే పురుషుల కంటే మహిళల ఓటర్లు పెరుగుతున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోనే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న మహిళల ఓట్లు కీలకంగా మారుతున్నాయి. వీరి ఓట్ల వల్లనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు దివంగత సీఎం జయలలిత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బీహార్ సీఎం నితీష్ కుమార్ వంటి నేతలు ఎక్కువ సార్లు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నారు. అలాగే బీజేపీ నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా మహిళల ఓట్లే కీలకంగా మారాయి.
సంక్షేమం, భద్రతపై మహిళల్లో సానుకూలత..
ముఖ్యంగా బీజేపీ పట్ల మహిళలు ఆసక్తి చూపిస్తూ ఉంటారని గత గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే నేరాలు అదుపులో ఉంచడం, శాంతి భద్రతలు కంట్రోల్‌లో ఉండటం, ఉగ్రదాడులు పూర్తిగా తగ్గడం, కరోనా మహమ్మారి సమయంలోనూ ఇంటింటికీ రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేయడం వంటి అంశాలు కాషాయం పార్టీ పట్ల మహిళల్లో ప్రత్యేక నమ్మకం తెచ్చిపెట్టాయి. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఆహార భద్రత, ఎల్పీజీ సిలిండర్లు, ఇంటి నిర్మాణం, ఎల్‌ఇడి లైట్లు, ప్రత్యక్ష నగదు బదిలీ వంటి అనేక పథకాలు మహిళలను బాగా ఆకర్షించాయి. దీంతో 2019 ఎన్నికలతో పాటు ఇటీవల రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మహిళల ఓట్లు అధికంగా పడ్డాయి.
మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చాం..
అయితే తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చామంటుంది. తమ ప్రభుత్వం మహిళలకు సంక్షేమ పథకాలు అందించినంతగా మరే పార్టీ చేయలేదని చెబుతోంది. ఒంటరి మహిళలు, వృద్ధులు, వితంతువులకు ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఉదాహరణగా పేర్కొంటుంది. మొత్తానికి మహిళల రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభిస్తే ఈ విజయాన్ని తమదంటే తమదని క్రెడిట్ కొట్టే పనిలో బీఆర్ఎస్, బీజేపీ ఉన్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీ విభజనపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు