విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సినిమాకు 50 ఏళ్ళు!

విప్లవ వీరుడు.. బ్రిటీషర్ల గుండెల్లో మంటలు రేపిన విప్లవాగ్ని అల్లూరి సీతారామరాజు కథతో హీరో కృష్ణ నిర్మాతగా 1974, మే 1న అల్లూరి సీతారామరాజు సినిమా విడుదల అయింది

త్రిపురనేని మహారథితో స్క్రిప్టు రూపొందించి చిత్ర నిర్మాణానికి సిద్ధం అయ్యారు కృష్ణ. మహారథి అంతకుముందు ఒప్పుకున్న సినిమాలను కూడా రద్దు చేసుకొని, ఆ ఆదర్శయోధుడి వీర చరిత్ర గురించి అనేక పరిశోధనల అనంతరం కథ తయారుచేశారు.

1973 డిసెంబరు 12న చిత్రీకరణ ప్రారంభమైంది. ఛాయాగ్రాహకుడైన వి.ఎస్‌.ఆర్‌.స్వామి.. సలహా ఇవ్వడంతో తెలుగులో మొదటి సినిమా స్కోప్ గా నిర్మించారు

ఈ సినిమాకు వి.రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఆయన ఆకస్మికంగా మరణించడంతో మిగిలిన సినిమాని కె.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కించారు

మొదట ఈ సినిమాను ఎన్టీఆర్ చేయాలని అనుకున్నారు. ఈ విషయంలో కృష్ణకు ఎన్టీఆర్ కు మధ్య విబేధాలు వచ్చాయి. సినిమా విడుదలైన తరువాత చూసిన ఎన్టీఆర్ కృష్ణను మెచ్చుకుని తన ఆలోచన విరమించుకున్నారు

ముఖ్యమైన అగ్గిరాజు పాత్రకు ముందు ఎస్వీఆర్ అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల బాలయ్యతో ఆ పాత్ర వేయించారు. సినిమాలో బాలయ్య నటన అందరితోనూ చప్పట్లు కొట్టించింది.

అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణ ఒక పక్క.. ఆయనను పట్టుకోవాలి లేదా కాల్చి చంపాలి అని చూసే బ్రిటిష్ అధికారి రూథర్ ఫర్డ్ పాత్రలో మరో పక్క కొంగర జగ్గయ్య. ఈయన చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. తనదైన డైలాగ్ డెలివరీతో రూథర్ ఫర్డ్ పాత్రకి జీవం పోశారు.

ఈ సినిమా 19 కేంద్రాల్లో శతదినోత్సవంతో భారీ విజయాన్ని నమోదు చేసింది. రిపీట్‌ రన్‌లోనూ వంద రోజులు ఆడిన మాయాబజార్‌, దేవదాసు వంటి అతి తక్కువ సినిమాల సరసన అల్లూరి సీతారామరాజు చోటు సంపాదించింది.

ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాటకు జాతీయస్థాయిలో ఉత్తమ గీత రచన పురస్కారం లభించింది. తెలుగు సినిమాకు ఈ అవార్డు రావడం అదే మొదటిసారి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ చిత్రానికి స్వర్ణ నందిని బహూకరించింది. ఆఫ్రో-ఏషియన్‌ చలన చిత్రోత్సవంలో కూడా ఈ సినిమా ప్రదర్శితమై బహుమతి అందుకుంది.