బూత్ కమిటీల నుంచి చర్యలు
విజయవాడలో బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్ అధ్యక్షతన రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏపీలో బీజేపీ బలం పుంజుకోవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేక వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకుని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పారు. ఇందుకోసం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆమె వివరించారు. బూత్ కమిటీల నుంచి మండల కమిటీలను పటిష్ఠం చేసే దిశగా పార్టీ నాయకులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలని పురందేశ్వరి అన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రతీ కార్యకర్త శ్రమిస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఎన్నికల హామీలు అన్నింటినీ నెరవేర్చామని జగన్ సహా వైసీపీ నేతలంతా చెబుతున్నారని పురందేశ్వరి గుర్తుచేశారు. నిజంగానే హామీలన్నీ అమలయ్యాయా, ప్రజలు ఏమంటున్నారనేది ప్రత్యక్షంగా కలిసి తెలుసుకోవాలని సూచించారు.
సమస్యలపై పోరాడితే తప్పకుండా ఆదరిస్తాం
ప్రస్తుతం ఏపీలో ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతున్నారని, వారితో పాటు కలిసి సమస్యలపై పోరాడితే బీజేపీని వారు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 4 నెలలు మాత్రమే ఉందన్న పురందేశ్వరి.. ఈ తక్కువ సమయంలోనే అధికార పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పురందేశ్వరి కోరారు. బూత్ స్థాయి నుంచి వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. భారతమాత ఫొటోకి పూలమాల వేసి, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం ద్వారా ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్టప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ఇంఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.