నిత్యం ఆటాపాటలతో ఎంతో ఆనందంగా గడిపే కుటుంబం వాళ్లది. హాలీడే దొరికితే చాలు.. ఏదో ఒక పిక్నిక్ స్పాట్‌లో వాలిపోయే ఫ్యామిలీ వారిది. అయితే అదే పిక్నిక్ సరదా తమ బతుకుల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుందని ఊహించలేకపోయారు. ఫొటోల పిచ్చి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బీచ్‌లో అలల తాకిడి ఒక్కసారిగా పెరగడంతో సముద్రంలో కొట్టుకుపోయి ఓ మహిళ మృతి చెందిన ఘటన ముంబైలో జరిగింది.
పూర్తి వివరాలివే:
ముంబై బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్‌లో 32 ఏళ్ల జ్యోతి సోనార్ అనే మహిళ భారీ అలలకు కొట్టుకుపోవడంతో కుటుంబ విహారయాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. జ్యోతి ఆమె భర్త ముఖేశ్..వాళ్ల పిల్లలు కలసి హాలీడే ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ముందుగా జుహు చౌపటీని సందర్శించాలనుకున్నారు. కానీ సముద్రంలో అధిక ఆటుపోట్లు కారణంగా సందర్శకులను బీచ్‌లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించారు. దీంతో ప్లాన్ మార్చుకున్న జ్యోతి ఫ్యామిలీ బాంద్రా వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడి బ్యాండ్‌స్టాండ్‌కి చేరుకున్నారు. అప్పటివరకు అంతా ఆనందంగానే గడిచింది. తర్వాత జ్యోతి, తన భర్త తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబానికి కన్నీటి వ్యథను మిగిల్చింది.
పిల్లలు ఫొటోలు..తల్లి అలల్లో అలా..:
బ్యాండ్‌స్టాండ్ వద్ద చాలా సేపు గడిపిన తర్వాత కుటుంబమంతా అక్కడే కలిసి ఫొటోలు దిగారు. ఇదే సమయంలో సముద్రం ఒడ్డుకు కొంచెం లోపలికి ఉండే ఓ రాక్(బండ)పై కూర్చొని ఫొటోలు దిగుదామని భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. అప్పటికి అలల తాకిడి కాస్త ఎక్కువగానే ఉన్నా..ఏం కాదులే అని ముందుకు సాగారు. తల్లిదండ్రులు బండపై కూర్చుంటే పిల్లలు కాస్త దూరం నుంచి ఫొటోలు తీస్తున్నారు. ఇలా ఫొటోలకు ఫోజులు ఇస్తున్న వాళ్లపై అలలు దూసుకొచ్చాయి. అప్పటివరకు అటుపోట్లు సాధారణంగా ఉండగా.. ఒక్కసారిగా అవి తీవ్రరూపం దాల్చాయి. అంతే ఆ అలల తాకిడికి జ్యోతి, ఆమె భర్త కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న కొంతమంది సందర్శకులు ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నించారు. భర్త ముఖేశ్‌ని అతికష్టంమీద కాపాడగా.. జ్యోతి మాత్రం అలల్లో కనపడనంతా దూరం వెళ్లిపోయింది.
రంగంలోకి రెస్క్యూ టీమ్:
జ్యోతి అలల్లో కొట్టుకుపోవడంతో ఏం చేయాలో అర్థంకాని సందర్శకులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంద్రా కోట వద్ద సముద్రంలో మునిగిపోయిన జ్యోతి సోనార్ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చాలాసేపు గాలింపు తర్వాత జ్యోతి దొరికింది కానీ.. అది ప్రాణాలతో కాదు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. ఫార్మాలిటిస్ తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. జ్యోతి మరణంతో భర్త ముఖేశ్‌తో పాటు పిల్లలు తీవ్రవిషాదంలో మునిగిపోయారు. మమ్మీ..మమ్మీ అంటూ పిల్లలు ఏడుస్తుంటే చుట్టూఉన్నవాళ్లు కూడా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తల్లిని పొగొట్టుకున్న ఆ పిల్లలను ఓదార్చడం ఎవరివల్ల కాలేకపోయింది.