కదంతొక్కిన తెలుగు మహిళలు..
టీడీపీ మహిళా నేతలు కదంతొక్కారు. సోమవారం ఉదయం విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయం వద్ద నిరసనకు దిగారు. ఏపీలో మహిళలను కాపాడాలంటూ కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని వేడుకున్నారు. నాలుగు సంవత్సరాలుగా తనపై నీచంగా పోస్టులు పెడుతున్నారని అనిత ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం జగన్ సతీమణి భారతీరెడ్డిపై పోస్టులు పెడితే మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ హుటాహుటిన స్పందించారని.. రాష్ట్రంలో భారతీరెడ్డి మాత్రమే మహిళానా? ఇంకెవరూ మహిళలు కాదా? అని ప్రశ్నించారు. తప్పుడు పోస్టుల పట్ల పోలీసులు ఎందుకు స్పందించరని నిలదీశారు.
ఇకపై చెప్పులతోనే సమాధానం..
పోలీసులు తోలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తన గురించి పోస్టులు పెట్టేవారికి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీరెడ్డి గురించి పోస్టు వస్తేనే పోలీసులు స్పందిస్తారా?.. పవన్ కళ్యాణ్ భార్యపైనా, తమపైనా తప్పుగా మాట్లాడిన వారిపై పోలీసులు ఎందుకు చర్చలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకపై వైసీపీ కార్యకర్తలు, నేతలు మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే చెప్పులతోనే సమాధానమిస్తామని హెచ్చరించారు. భారతీరెడ్డి అనుచరుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతోందని ఆమె ఆరోపించారు.
త్వరలోనే ఒక్కొక్కరి తాట తీస్తాం..
తప్పుడు పోస్టులు పెడుతున్న ప్రతి ఒక్కరి చిట్టా తమ దగ్గర ఉందని.. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. జగన్ రెడ్డి కాదు కదా వాళ్ల తాత రాజారెడ్డి వచ్చినా మిమ్మల్ని కాపాడలేరంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. భారతీరెడ్డి రాష్ట్రంలో నువ్వు ఒక్కదానివే మహిళవా? మేము మహిళలం కాదా? అని నిలదీశారు. అమ్మవారి సాక్షిగా చెబుతున్నాం.. మీ భర్త జగన్ రెడ్డి, మీ అనుచరులను కంట్రోల్‌లో పెట్టుకో లేదంటో మేమే కంట్రోల్‌లో పెడతామని సూచించారు. పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియా పోస్టుల వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళలందరూ తమతో కలిసి రావాలని.. ఈ అరాచక ప్రభుత్వం మీద పోరాటం చేద్దామని అనిత పిలుపునిచ్చారు.