'ఓరేయ్ కూల్‌డ్రింక్స్ తీసుకురా..' ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే అమ్మా,నాన్న పిల్లలకు చెప్పే పని ఇదే..! ఇంటికొచ్చే గెస్టులను మర్యాద చేయడం నుంచి మాంసం ముద్ద దిగే వరకు కూల్‌డ్రింక్ వాడకం సర్వసాధరణమైపోయింది. తిన్నది అరగడానికన్న సాకుతో మాంసం కంటే ఈ కూల్‌డ్రింకుల గ్రాసులే ఎక్కువగా తాగేస్తుంటారు. అయితే అలా అరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చెప్పే ప్రభుత్వాలు కూడా కూల్‌డ్రింక్స్ విషయంలో మెతక వైఖరినే అవలంభిస్తుంటాయి. కొంతమంది సినీ సెలబ్రెటీలు సైతం కూల్‌డ్రింక్స్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లగా వ్యవహరిస్తుంటారు. అంతలా నార్మలైజ్ ఐపోయిన కూల్‌డ్రింక్స్ క్యాన్సర్‌కు కారణమని తెలుసా..? గుండెజబ్బులు రావడానికి కూడా కారణమవుతున్నాయని తెలుసా..? ఇది ఎవరో చెప్పిన విషయాలు కావు.. సాక్ష్యత్తు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధ్యయనంలో తేలిన నిజాలు..!
WHO ఏం చెప్పిందంటే..?
ఇంటర్ నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ క్యాన్సర్ (IARC), వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(FAO) జాయింట్ ఎక్స్ ఫర్ట్ కమిటీ ఆన్ ఫుడ అడిటివ్స్ (JECFA) ఆస్పర్టేమ్పై అధ్యయనం తర్వాత అంచనాలను విడుదల చేసింది. 'కార్సినో జెనిసిటికి' కారణంగా ఉదహరిస్తూ ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకంగా వర్గీకరించింది. ఆస్పర్టేమ్ వాడకంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అటు అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా సంస్థ కూడా పలుమార్లు హెచ్చరించింది. గతంలో జంతువులపై చేసిన అధ్యయనంలోనూ ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమేనని తేలింది.
ఆస్పర్టేమ్ అంటే ఏంటంటే..?
ఆస్పర్టేమ్ అన్నది ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్(కృత్రిమ తీపి). ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోని శీతల పానీయా(కూల్‌డ్రింక్స్)ల్లో దీన్ని వినియోగిస్తుంటారు. వివిధ రకాల ఆహార పదార్థాల్లో కూడా వీటిని ఉపయోగిస్తారు. డైట్ డ్రింక్స్, చూయింగ్ గమ్, జెలటిన్, ఐస్‌క్రీమ్, పెరుగు లాంటి పాల ఉత్పత్తులు, టూత్ పేస్ట్, దగ్గు మందులు, పలు రకాల విటమిన్లలో దీన్ని వాడుతుంటారు. షుగర్ పేషెంట్లు చక్కెరకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్లను వాడుతుంటారు. ఇది సుక్రోజ్ కంటే సుమారు 200 రెట్లు తియ్యగా ఉంటుంది. ఆస్పార్టిక్ యాసిడ్, ఫెనిలాల్‌నైన్ అనే రెండు అమైనో యాసిడ్లతో ఈ స్వీట్‌నర్‌ను తయారు చేస్తారు. కొద్దిమొత్తంలో మిథనాల్ కూడా కలిపి ఉంటుంది. దీన్ని 'న్యూట్రాస్వీట్' అని కూడా పిలుస్తారు.
ఆస్పర్టేమ్ ఎప్పటినుంచి వాడుతున్నారు..?
1965లో అమెరికన్ డ్రగ్ పరిశోధకుడు జేమ్స్ ష్లాటర్ ఆస్పర్టేమ్‌ని అనుకోకుండా కనుగొన్నారు. యాంటి అల్సర్ మందులపై రీసెర్చ్ చేస్తున్న సమయంలో అతని చేతిపై అనుకోకుండా ఓ పదార్థం పడింది. ఊరికే దాన్ని నాలుకుతో టేస్ట్ చేశాడు. కాస్త తియ్యగా అనిపించగా..దీనిపై మరింత పరిశోధన చేశాడు. చివరకు ఇది ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్‌గా పనికొస్తుందని ఓ నిర్ధారణకు వచ్చాడు. అనేక సంవత్సరాల పరీక్షల తర్వాత.. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆస్పర్టేమ్‌ని ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్‌గా ఆమోదించింది. అప్పటినుంచి దీని వినియోగం మొదలైంది. కోక్ డ్రింక్స్‌లో పాటు వివిధ ఆహారపదార్ధాల్లో ఆస్పర్టేమ్‌ని చక్కెరకు రిప్లేస్‌మెంట్‌గా వినియోగించడం మొదలుపెట్టారు. అయితే మొదటినుంచి ఆస్పర్టేమ్ వాడకం వివాదాస్పదమే..! ఆస్పర్టేమ్‌పై అనేక అనుమానాలు రావడంతో 'పెప్సీకో' కొన్నాళ్లు తమ సాఫ్ట్‌డ్రింక్స్‌లో వీటిని వినియోగించడం ఆపేసింది. అదే సమయంలో పెప్సీ సేల్స్ కూడా పడిపోయాయి. దీంతో మళ్లీ ఆస్పర్టేమ్‌ని తీసుకొచ్చింది. ఇలా ఆస్పర్టేమ్ లేకుండా కూల్‌డ్రింక్స్‌లేని పరిస్థితి దాపరించింది.
ఆస్పర్టేమ్ వాడకంపై భిన్నాభిప్రాయాలు:
ఆస్పర్టేమ్ విషయంలో ఇప్పటివరకు అంతా ఓ ఏకాభిప్రాయంతో లేరు. WHO ఒక మాట..మిగిలిన సంస్థలు మరో మాట చెబుతుంటాయి. ఇక WHOసైతం అధిక మోతాదులో తీసుకుంటేనే ప్రమాదమని.. తక్కువ తీసుకుంటే ఏమీ కాదని అంటుంటుంది. రోజులో ఒక వ్యక్తి శరీర బరువులో కిలో గ్రాముకు 40 మిల్లీ గ్రాముల చొప్పున తీసుకోవడం సురక్షితమేనంటోంది. అయితే ఇలా చెప్పడం వెనుక అనేక ఒత్తిడులు ఉన్నాయని.. ప్రముఖ కూల్‌డ్రింక్స్ కంపెనీల ప్రెజర్ తట్టుకోలేకనే WHO ఈ విధంగా సూచిస్తుంటుందని.. అసలు కూల్‌డ్రింక్స్ వల్ల లాభమేంటో చెప్పాలని పలువురు వైద్యులు వాదిస్తుంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్‌తో బరువు తగ్గవచ్చాన్న వార్తలను కూడా WHO ఎప్పుడో ఖండించింది. కేవలం తమ వ్యాపారాలు నిలబడాలనే ఉద్దేశంతోనే కంపెనీలు ఇలాంటి రూమర్లు ప్రచారం చేస్తుంటాయని..బరువు తగ్గడానికో..పెరగడానికో ఆస్పర్టేమ్ ఏ విధంగా సాయం చేయదని డాక్టర్లు కుండబద్దలు కొడుతున్నారు. వ్యక్తి బరువు..మోతాదు..ఇవన్ని ఎందుకని.. అసలు తాగడం మానేస్తే పోతుందని కదా అని సూచిస్తున్నారు.
బ్యాన్ చేస్తారా..?
ఆస్పర్టేమ్‌పై నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చిన ప్రతిసారి కూల్‌డ్రింక్స్ బ్యాన్ చేయాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంటోంది. వీటిని నిషేధిస్తారంటూ సోషల్‌మీడియాలో ప్రచారాలు కూడా జరుగుతుంటాయి. అయితే ప్రభుత్వాలు వీటి గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించవు. ఇదంతా కొంతమంది క్రియేట్ చేసే న్యూస్ మాత్రమే. ఆస్పర్టేమ్‌ను మనదేశంలో విక్రయించేందుకు ‘ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (FSSAI) అనుమతి ఉంది. అయితే దీనిపై FSSAI మరోసారి ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. WHO రిపోర్ట్ తర్వాతైనా పరిస్థితులు మారాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే 140కోట్ల మంది ప్రజలు జీవితాలను ప్రభావితం చేసే విషయం ఇది. కొంచెం తాగితే సమస్య లేదు కదా అని భావించవద్దని.. అసలు ఆ కొంచెంతో వచ్చే లాభాలేవి లేవు కదా అన్నది నిపుణుల మాట. ఆర్టిఫిషయల్ స్వీట్‌నర్లతో క్యాన్సర్, గుండెజబ్బులే కాకుండా టైప్-2 డయాబెటిస్ కూడా వస్తుందన్న విషయం మరవకూడదని..ఈ విషయంపై కేంద్రం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.