రైతు పాలిట శాపంగా టమాటా పంట..
కొన్ని రోజులుగా టమాటా ధరలు కేజీ రూ.100 నుంచి 150 మధ్య పలుకుతున్నాయి. దీంతో టమాటా రైతులకు భారీ డిమాండ్ ఏర్పడింది. కొంతకాలంగా నష్టాలు చూసిన రైతులు ధరల పెరుగుదలతో లాభాల బాట పడుతున్నారు. కానీ ఈ లాభాలే ఓ టమాటా రైతు పాలిట శాపంగా మారాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం బోడిమలదిన్నెకు చెందిన రాజశేఖర్ రెడ్డి అనే రైతు ఊరికి దూరంగా తన నాలుగు ఎకరాల్లో టమాటా సాగుతో పాడి వ్యాపారం కూడా చేస్తున్నారు. అయితే ఇటీవల ఐదు కోతల పంటను అమ్మగా భారీ లాభాలొచ్చాయి. తాజాగా కూడా మార్కెట్లో పంట విక్రయించగా మంచి ఆదాయం వచ్చింది.
కాపు కాసి.. హత్య చేసి..
టమాటా పంటలో భారీగా డబ్బులు సంపాందించారని తెలుసుకున్న కొంతమంది దుండగులు ఆయన హత్యకు పథకం వేశారు. పొలానికి వెళ్లి రాజశేఖర్‌రెడ్డి గురించి ఆయన భార్యను వివరాలు అడగ్గా.. మదనపల్లె డిపోలో పాలు పోయడానికి వెళ్లాడని చెప్పారు. దీంతో వారు దారి మధ్యలో కాపు కాశారు. ఇంతలో ఆయన బైక్‌పై రావడంతో బైకును ఆపి చేతులు కాళ్లు కట్టేసి, మెడకు టవల్ చుట్టి హతమార్చారు. అనంతరం అతని దగ్గర ఉన్న డబ్బులను తీసుకుని పరారైయ్యారు.
డబ్బుల కోసమే మర్డర్..
రాజశేఖర్‌రెడ్డి ఎంతసేపు అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. తమ పొలానికి సమీపంలోనే ఆయన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. టమాటాలు విక్రయించగా వచ్చిన డబ్బుల కోసమే హత్య జరిగినట్లు కుటుంబ సభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.