CM KCR Vs Thummala: నిన్న సీఎం కేసీఆర్ పాలేరులో పర్యటించిన తర్వాత ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మల నాగేశ్వరరావును పిలిచి మంత్రి పదవి ఇస్తే ఆయన బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) చేసింది సున్నా అంటూ కేసీఆర్ (CM KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల (Thummala Nageshwara Rao) కూడా ఇంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను పార్టీలో చేరినప్పుడు జిల్లాలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక్క ఎంపీటీసీ సభ్యుడు కూడా లేరన్నారు. అలాంటి పరిస్థితుల్లో బాలసాని లక్ష్మీనారాయణను స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలిపించామని గుర్తు చేశారు. ఆ సమయంలో ఖమ్మం కార్పోరేషన్ పై కూడా గులాబీ జెండా ఎగురవేయడానికి ప్రజలకు తనపై ఉన్న విశ్వాసమే కారణమన్నారు. తాను ప్రజల కోసం పార్టీ మారాను తప్పా.. పదవుల కోసం కాదన్నారు. పదవులన్నీ తన దగ్గరకు వెతుక్కుంటూ వచ్చాయన్నారు.
ఇది కూడా చదవండి: Khammam Politics: ఆందోళనలో పొంగులేటి.. చుక్కలు చూపిస్తున్న హైకమాండ్.. అసలేం జరుగుతోంది?
1995లో కేసీఆర్ కు రవాణ మంత్రి పదవి ఇప్పించడంలో తన భాగస్వామ్యం ఉందన్నారు తుమ్మల నాగేశ్వర రావు. అలాంటిది.. నువ్వు ఈ రోజు నాకు పదవి ఇచ్చేది ఏందని.. కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తాను చేసిన అభివృద్ధిని ఓర్వలేకనే కేసీఆర్ కుటుంబ సభ్యులే తనను ఓడించారని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆత్మవంచన చేసుకుని పాలేరు సభలో మాట్లాడారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై సోషల్ మీడియాలోనూ ఇరు పార్టీల అభిమానులు కామెంట్ల యుద్ధం చేస్తున్నారు.
తాజాగా తుమ్మల నాగేశ్వరరావు సోషల్ మీడియాలో తాను పార్టీలోకి రాక ముందు 2014లో టీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లాలో వచ్చిన ఓట్లు.. 2018లో టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల వివరాలను పోస్టు చేశారు. ''గణాంకాలు చెప్తాయి నిజాలు!!'' అన్న క్యాప్షన్ తో చేసిన ఈ పోస్టుపై ఇరు పార్టీల నేతలు రియాక్ట్ అవుతున్నారు. తుమ్మలతోనే బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లాలో ఎంట్రీ వచ్చిందని ఆయన అభిమానులు అంటుంటే.. అదే నిజమైతే 2018లో తుమ్మల ఎందుకు ఓడిపోయరని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో తుమ్మలను పాలేరు భగీరథుడంటూ కేసీఆర్ మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు తుమ్మల. మంత్రి పువ్వాడ అజయ్ సైతం నిన్న కేసీఆర్ మాట్లాడిన వీడియోను పోస్టు చేశారు. ఈ పోస్టుపై కూడా బీఆర్ఎస్, తుమ్మల అభిమానుల మధ్య వార్ నడుస్తోంది.