Hyderabad: నిరుద్యోగ యువతకు తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 18 నుంచి 35 ఏళ్ల లోపు యువతి, యువకులకు ఉచిత డ్రైవింగ్ (లైట్, హెవీ మోటార్ వెహికిల్) శిక్షణ అందిచబోతున్నట్లు ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 20లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలాజీ ప్రకటన విడుదల చేశారు.
హకీంపేట్ డ్రైవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో..
ఈ మేరకు హకీంపేట్ డ్రైవర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచిత భోజనతోపాటు వసతి సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ అర్హతకు 18 నుంచి 35 ఏళ్ల లోపల వయసు, 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్‌కు 20 నుంచి 35 ఏళ్ల వయసు, పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ట్రాన్స్‌జెండర్లు సైతం ఈ అవకాశం వినియోగించుకోవాలని, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
వంద మంది మహిళలకు ఎలక్ట్రికల్ ఆటోలు..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వంద మంది మహిళలకు ఎలక్ట్రికల్ ఆటోలు ఇవ్వాలని నిర్ణయించింది. మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించే కార్యక్రమాలు ‘మువ్’ పేరిట చేపడుతోంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలోని మహిళా ప్రాంగణాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ఆగస్టు 12 నుంచి శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వంద ఈ-ఆటోలు అందజేయనున్నారు. మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ ద్వారా వాహనాలు పొందినవారు ఓలా, జొమాటో మాదిరి సేవలు మహిళలు అందించేలా చర్యలు తీసుకోబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. 18-40 మధ్య వయస్సు ఉన్న మహిళలు, యువతులకు ఉపాధి కల్పనలో భాగంగా వివిధ కోర్సులలో శిక్షణ, నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్ బండ్రు శోభారాణి తెలిపారు.