Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జగిత్యాల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో జగిత్యాల ప్రజలపై హామీల వర్షం కురిపించారు కవిత. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ దూసుకుపోతుందని కవిత అన్నారు. అభివృద్ధికి బ్రేకులు పడకుండా ఉండాలంటే జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ ను గెలిపించాలని కోరారు.
ALSO READ: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. బీజేపీ మేనిఫెస్టో!
జగిత్యాల పర్యటనలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వలసలు తగ్గాయని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) హయాంలో తాగేందుకు మంచి నీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలతో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలో ఈసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు పింఛన్‌ను రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ. 3 వేలు ఇస్తామని పేర్కొన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల బీమా వర్తింపజేస్తాం అని వెల్లడించారు.
ALSO READ: బ్యాచ్ నెంబర్ 420 జగ్గడు.. జగన్ పై లోకేష్ సెటైర్లు!
వైద్య రంగంలో తెలంగాణ ముందస్తు స్థానంలో ఉందని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షల వరకు పెంచుతామని అన్నారు. మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200కు పెంచిందని పేర్కొన్నారు. మోదీ పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి.. కేవలం రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.