తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ చకచకా జరుగుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడి ఈ వివరాలను వెల్లడించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49కేంద్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. 2018 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గిందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర మూడెంచల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగుతుందన్నారు. 500లకుపైగా పోలింగ్ కేంద్రాలు ఉన్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని…మొదటి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించున్నట్లు తెలిపారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ సారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లు లెకిస్తారు. 8.30గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లు లెక్కింపు షురూ అవుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కానట్లయితే…రెండు ఓట్ల లెక్కింపు ప్రక్రియలను సమాంతరంగా నిర్వహిస్తామన్నారు. పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుందని…పరిశీలకుల ఆమోదం తర్వాతే ఫలితాలను వెల్లడిస్తామని ఈసీ అధికారి తెలిపారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ప్రతి టేబుల్ కు ఒక పరిశీలకుడిని నియమించింది ఎన్నికల సంఘం.
ఇక 75శాతానికి మించి 79 నియోజకవర్గాల్లో పోలింగ్ నమోదు అయినట్లు చెప్పారు. ఎక్కడా కూడా రీపొలింగ్ అవసరంలేదన్నారు. అధికశాతం కేంద్రాల్లో సాయంత్రం 4గంటల నుంచి పోలింగి పెరిగిందన్నారు.