రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన యువకుడు.. అక్కా తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. అగంతకుడి దాడిలో తీవ్రంగా గాయపడిన తుమ్ముడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఆర్టీసీ కాలనీలో ఉన్న యువతి ఇంటికి ఓ యువకుడు వచ్చాడు. ఐ విల్ కిల్ యూ బంగారం అంటూనే తన వెంట తెచ్చుకున్న కత్తిని బయటకు తీశాడు. ఆ వెంటనే పక్కనే ఉన్న సంఘవి మెడ, మొహం, చేతులపై దాడి చేశాడు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అక్కపై దాడితో అలర్ట్ అయిన తమ్ముడు చింటు నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతనిపైనా దాడి చేశాడు. ఈ క్రమంలో చింటూ, నిందితుడి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న అద్దాలన్నింటినీ నిందితుడు పగలకొట్టాడు. అయితే, నిందితుడి దాడి నుంచి తప్పించుకునేందుకు సంఘవి, చింటూ ఇద్దరూ తమ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. అయినప్పటికీ వారిని వెంబడించాడు నిందితుడు శివకుమార్. అది గమనించిన చుట్టుపక్కల వారు కర్రలతో వచ్చి నిందితుడిని కొట్టి.. ఇంట్లో బంధించి తాళం వేశారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమ వ్యవహారమే దాడికి కారణం..
నిందితుడు శివకుమార్, సంఘవిని ప్రేమించుకుంటున్నారట. ఈ క్రమంలో పెళ్లి చేసుకునే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం నడుస్తోందట. ఇదే విషయమై మాట్లాడేందుకు సంఘవి ఇంటికి వచ్చాడు నిందితుడు శివకుమార్. పెళ్లి విషయం మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే కోపోద్రిక్తుడైన శివకుమార్.. కత్తితో సంఘవిపై అటాక్ చేశాడు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె సోదరుడిపైనా అటాక్ చేశాడు నిందితుడు. అయితే, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతిని, ఆమె తమ్ముడు చింటూను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చింటూ ప్రాణాలు కోల్పోయాడు. సంఘవి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
https://www.youtube.com/watch?v=sqMT0GQ4Y-g
ఎల్బీ నగర్లో టెన్షన్..
ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనతో స్థానిక ప్రజలు ఉలిక్కి పడ్డారు. నిందితుడిపై దాడి చేసి అతన్ని బంధించారు స్థానికులు. ఆపై పోలీసులకు సమాచారం అందించగా.. వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు.
జగద్గిరిగుట్టలోనూ ఇలాంటి ఘటనే..
హైదరాబాద్‌లోని జగద్గిరి గుట్టలోనూ శుక్రవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తనను ప్రేమించాలంటూ ఓ యువకుడు అమ్మాయిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆపై తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయ్‌నగర్ కాలనీలో నివాసం ఉంటునన యువతి కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంది. అదే ప్రాంతంలో నద్దునూరి రాజు ఉండేవాడు. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న రాజుకు సోషల్ మీడియా ద్వారా యువతి పరిచయం అయ్యింది. ఈ పరిచయంతోనే అతను ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పెడ్డాడు. ఇలా రోజూ వేధింపసాగాడు. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరూ స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నిందితుడు రాజుపై కేసు నమోదు చేశారు పోలీసులు.