Lokayukta: లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ఆదేశాలతో 60 ఏళ్లుగా ఫ్యామిలీ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ఓ వృద్ధురాలికి న్యాయం జరిగింది. బాధితురాలు పెన్షన్ పత్రాలతోపాటు 60 ఏళ్ల పెన్షన్ బకాయిలు రూ.15.70 లక్షలను ట్రెజరీ అధికారుల నుంచి అందుకుంది. జీవిత చరమాంకంలో ఉన్న తనకు లోకాయుక్త ఆదేశాలతో న్యాయం జరిగిందంటూ ఆనందం వ్యక్తం చేసింది.
Also read: శ్రీనాధ్ ను చంపేసింది భార్యేనా? హత్య వెనుక ఇంత పెద్ద కారణముందా?
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బి. శేషగిరిరావు రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ విధులు నిర్వహించేవారు. 1962 ఫిబ్రవరి 6న ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారు. తన భర్త మరణించారని, తనకు పెన్షన్ మంజూరు చేయాలంటూ ఆయన సతీమణి బి.క్రిష్ణవేణి సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుంది. ఏళ్లు గడిచినా స్పందన లేకపోవడంతో దింపుడు కళ్లం ఆశతో 2021లో లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది.
Also Read: తెలంగాణలో పింఛన్ లు రూ.4 వేలకు పెంపు.. ఎప్పటినుంచంటే?
ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి… పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం బాధితురాలికి నెల రోజుల్లో పెన్షన్ మంజూరు చేయాలని కాకినాడ ట్రెజరీ అధికారులను ఆదేశించారు. లోకాయుక్త ఆదేశాలతో కదిలిన ట్రెజరీ అధికారులు క్రిష్ణవేణికి పెన్షన్ మంజూరు చేయడంతోపాటు 60 ఏళ్ల పెన్షన్ బకాయిలు రూ.15.70 లక్షలను చెల్లించినట్లు బుధవారం లోకాయుక్త కార్యాలయానికి రాత పూర్వకంగా తెలియజేశారని రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.