Megastar versus Superstar : మెగాస్టార్ సినిమా రిలీజ్ అంటే పునకాలు ఒక్కసారి కాదు.. 100సార్లు లోడ్ అవుతాయి. చిరంజీవి(Chiranjeevi)కి ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది మరి. అయితే తాజాగా రిలీజైన చిరు కొత్త సినిమా ‘భోళా శంకర్'(Bhola Shankar) చూసిన అభిమానులు మాత్రం థియేటర్ నుంచి నిరసంగా బయటకు వస్తున్నారు. డైరెక్టర్ కనిపిస్తే ***** అంటూ మైకులు ముందు బూతులు తిడుతున్నారు. ఏదో అనుకుంటే ఇంకేదో చూపించాడని మండిపడుతున్నారు. నిజానికి సినిమా మొదటి రోజు డివైడ్ టాక్ రావడం చాలా కామన్ థింగే.. కానీ భోళా శంకర్‌కి మాత్రం నెగిటివ్ టాక్ తప్ప ఒక్కచోట కూడా పాజిటివ్ టాక్ రాలేదు. చిరు ఫ్యాన్స్ కూడా తమ హీరో సినిమా హిట్ అని చెప్పుకోలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. చాలా నిజాయితీగా సినిమా బాలేదని చెప్పేస్తున్నారు. ఈ విషయంలో చిరు అభిమానులను కచ్చితంగా అభినందించాల్సిందే.. ఎందుకంటే సినిమా బాగోకున్నా బాగుందని.. బాగోలేదన్న వాడిని కొట్టే ఫ్యాన్స్ ఉన్న ఈ రోజుల్లో ఇంత జెన్యూన్‌గా అభిప్రాయం చెబుతున్నారంటే.. సినిమా వారిని ఎంతలా నిరాశ పరిచిందో ఊహించుకోవచ్చు!
పెద్ద నష్టమే:
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ యావరేజ్ టాక్‌తోనే రికార్డు వసూళ్లు రాబట్టింది. రూ.130 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన తాజా చిత్రం ‘భోళా శంకర్’ మాత్రం బ్రేక్ ఈవెన్ ఇవ్వడం కష్టమేనంటున్నారు మార్కెట్ ఎక్స్పర్ట్స్. థియేట్రికల్ వసూళ్ల నుంచి ఆ సినిమా రూ.80 కోట్ల షేర్ రాబడితే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. అయితే ఇది సాధ్యం కాదు. ఎందుకంటే యావరేజ్ టాక్ కూడా కాదు కదా.. బిలో యావరేజ్ టాక్ కూడా లేకపోవడమే దీనికి కారణం. నిజానికి ఈ సినిమా విషయంలో మొదటి నుంచి కూడా పెద్దగా హైప్ క్రియేట్ అవ్వలేదు. ఫ్లాప్ డైరెక్టర్‌గా ముద్ర పడ్డ మెహర్ రమేశ్ ఈ సినిమాను తెరకెక్కించడమే దీనికి ప్రధాన కారణంగా సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక తమిళంలో విజయం సాధించిన అజిత్ ‘వేదాళం’ని ‘భోళా శంకర్’గా ప్రేక్షకులకు ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలు.. అక్కడ అందుకున్న సక్సెస్‌ని మాత్రం రాబట్టలేరన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ఫామ్‌లోకి వచ్చిన రజినీ!
మరోవైపు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)- నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో విడుదలైన లేటెస్ట్ మూవీ ‘జైలర్’కు(Jailer Movie) ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ‘భోళా శంకర్’ సినిమాకు ఒక్క రోజు ముందు (ఆగస్టు 10) విడుదలైన ‘జైలర్’ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల చూస్తే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. తమిళనాడులో 23 కోట్ల గ్రాస్, ఆంధ్రాలో, నైజాం ప్రాంతంలో 13 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 12 కోట్ల రూపాయలు, కేరళలో 6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 35 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 91 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నిజానికి స్టోరీ పరంగా ‘జైలర్’ సినిమా గొప్పగా లేదని ఫ్యాన్సే చెబుతున్నా.. దశాబ్ద కాలంగా ఫామ్‌లో లేని రజనీని ఎలివెట్ చేస్తూ తీసిన సీన్స్‌తో పాటు అనిరుధ్ (Anirudh) బీజీఎం ఈ మూవీ కలెక్షన్లకు ప్రధాన కారణాలు. ఈ సినిమాలో పాత రజనీకాంత్ తిరిగి కనిపించాడని తెగ ఆనందపడిపోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇంతకంటే తమకేమీ అవసరం లేదని తేల్చిచెబుతున్నారు. దేశం గర్వించదగ్గ నటుల్లో ముందు వరుసలో ఉండే చిరు, రజనీ సినిమాలు ఒక్క రోజు గ్యాప్ వ్యవధిలో రిలీజ్ అవ్వగా.. మెగాస్టార్ సినిమా అభిమానులను నిరాశ పరచింది. ఇక కథలో సత్తా లేకున్నా.. వన్ మ్యాన్ షోతో రజనీ ఈ పోటిలో విన్నర్‌గా నిలిచాడంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్.
Also Read: అలనాటి నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష