ISRO Chairman Somanath : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చీఫ్ ఎస్. సోమనాథ్ చంద్రయాన్-3 విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో కూడా ఇస్రో ఇదేవిధంగా ‘మార్స్’ (Mars)పైకి దిగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు ‘మా కళ్ళు ఇప్పుడు ‘మార్స్’ పైనే ఉన్నాయని సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయం తరతరాలుగా ఇస్రో నాయకత్వం, శాస్త్రవేత్తల కృషి ఫలితమన్నారు. కాగా ఆదిత్య ఎల్ 1 పేరుతో సన్ మిషన్ ప్రయోగం చేపట్టబోతున్నట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు.
సెప్టెంబర్ మొదటివారంలో ఆదిత్య ఎల్-1ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆదిత్య ఎల్ 1 (Aditya L 1)ఇస్రో సన్ మిషన్ ప్రయోగంతో కరోనాగ్రఫీ స్పేస్ క్రాఫ్ట్ (Coronagraphy Spacecraft) ను భూమికి సూర్యుడికి మధ్య ఉన్న ఎల్ 1 పాయింట్ చుట్టూ ఉండే ఒక హాలో ఆర్బిట్ లో చొప్పిస్తారు. సౌర అయస్కాంత తుఫానులు, సౌరవాతావరణం, భూమి చుట్టున్న పర్యావరణంపై దాని ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేయనుంది.
కాగా ఇస్రో ఈ స్పేస్ క్రాఫ్ట్ ను దేశంలో పలు పరిశోధన సంస్థల సహకారంతో తయారు చేసింది. PSLV-XL(C57)ద్వారా షార్ శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఐదేళ్లపాటు లక్ష్యంగా ఆదిత్య ఎల్ 1సన్ మిషన్ కొనసాగించాలని ఇస్రో భావిస్తోంది.
అటు ఈ విజయం (Chandrayaan-3 Mission) చంద్రుని మిషన్పై మాత్రమే కాకుండా అంగారక గ్రహాంపైకి వెళ్లేందుకు మరింత విశ్వాసం పెరిగిందని సోమనాథ్ అన్నారు. అంగారక గ్రహంపై సాఫ్ట్ ల్యాండింగ్ ఉంటుందని భవిష్యత్తులో ఈ ప్రయత్నం శుక్రుడు, ఇతర గ్రహాలపై కాలుమోపనున్నట్లు తెలిపారు. చంద్రయాన్-2 కోసం పనిచేసిన ముఖ్యమైన శాస్త్రవేత్తలు కూడా చంద్రయాన్-3 బృందంలో భాగమేనని సోమనాథ్ చెప్పారు. చంద్రయాన్-2లో ఉన్న చాలా మంది మనతోనే ఉన్నారని, చంద్రయాన్-3లో మాకు సహాయం చేస్తున్నారని ఆయన అన్నారు. అందులో భాగమైన వారు చాలా సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. ఇది ప్రపంచ స్థాయి పరికరాలతో కూడిన పూర్తి ‘మేక్ ఇన్ ఇండియా’ (Make in India)మిషన్ అని సోమనాథ్ సూచించారు.
Also Read: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ఈ పది విషయాలు తెలుసుకోవల్సిందే..!!