రాజధాని హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ఎన్నికల రాజకీయం రంజుగా మారింది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. గెలుపు ఖాయమనుకున్న నియోజకవర్గాల్లో కూడా పోరు అనూహ్యంగా రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్ వైపే మెజార్టీ మొగ్గు చూపిస్తున్నా…రోజురోజుకీ మారుతున్న సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. దీనికి తోడు అగ్రనేతల ప్రచారం కూడా కొంత పరిస్థితులను ఛేంజ్ చేశాయని చెప్పక తప్పదు. ప్రాంతీయ, సామాజిక, ఇతర సమీకరణాలతో పాటు బస్తీల ఓట్లు కూడా గ్రేటర్ పరిధిలో కీలకం మారనున్నాయి.
Also read:తుది అంకానికి చేరుకున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం…ఈరోజే లాస్ట్
హైదరాబాద్ దేశంలో అన్ని ప్రాంతాల ప్రజల సమ్మేళనం. కాబట్టి ఇక్కడ ఓటర్లు కూడా అన్ని రాష్ట్రాలకూ చెందినవారు ఉంటారు. ఓ రకంగా మినీ ఇండియాగా హైదరాబాద్ ను చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని క్యాపిటల్స్ లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. ఇప్పడు ఇదే గ్రేటర్ ఓటర్ల తీర్పు మీద ఈసారి ప్రభుత్వం ఎవరిది అన్నది ఆధారపడి ఉంది. హైదారాబాద్ పరిధిలో 24 స్థానాలున్నాయి. ఇందులో ఎంఐఎంకు ఆరు లేదా ఏడు సీట్లు కచ్చితంగా వస్తాయి. మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పుర, బహదూర్‌పుర స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్నది. ఇక మిగిలిన వాటిల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి.
గత ఎన్నికలు చూసుకుంటే అప్పుడు అందరూ మూకుమ్మడిగా కలిసి బీఆర్ఎస్ కే పట్టం కట్టారు. ఏకంగా 14 స్థానాలు దక్కించుకుని ఆజేయంగా నిలిచింది. అంతకు ముందు కాంగ్రెస్ ఇక్కడ ఆధిక్యంలో ఉండేది. 2009లో హస్తం పార్టీ 14 స్థానాలు సంపాదించుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. మరోవైపు మజ్లిస్ సపోర్ట్‌తో బీఆర్ఎస్ మళ్ళీ గ్రేటర్ కిరీటం ధరించాలని ఊవ్విళ్లూరుతోంది. అయితే ఈసారి మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ మీద అసంతృప్తిగా ఉన్నాదనే టాక్ కూడా వినిపిస్తోంది. వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీకి దన్నుగా నిలుస్తారో లేదో చెప్పడం కష్టమే అని కూడా అంటున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ముస్లింల ప్రాబల్యం ఉంటుంది. గోషామహల్ లాంటి చోట్ల పోటీ చేయకుండా.. బీఆర్ఎస్కు మజ్లిస్ మద్దతు ఇస్తోంది. ఇతర చోట్ల కూడా అంతే. అయితే ముస్లిం ఓటర్లు మజ్లిస్ బరిలో లేకపోతే ఈ సారి కాంగ్రెస్ కు ఓటు వేస్తారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయన్న అభిప్రాయం ఎక్కువగా వినిపించడమే కారణం. ఒకవేళ అదే కనుక చేరితే మజ్లిస్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలవదు కాబట్టి కాంగ్రెస్‌తోనే పొత్తు పెట్టుకుంటుంది. అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ సింహాసనం ఎక్కే ఛాన్స్ వస్తుంది.
మరోవైపు హైదరాబాద్ లో బీజేపీ ప్రభావం కూడా తక్కువేమీ కాదు. క్రితంసారి కేవలం గోషామహల్ లో మాత్రమే గెలుపొందింది బీజేపీ. కానీ ఈసారి లెక్కలు మారాయి అంటున్నారు. గోషామహల్‌తోపాటు 2014లో గెలిచిన ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, ఉప్పల్‌లను నిలబెట్టుకోవాలని ఆ పార్టీ అనుకుంటోంది. అదే సమయంలో శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, మల్కాజ్గిరి, స్థానాల్లోనూ తన బలమేమిటో చూపెట్టాలనుకుంటున్నది. అందుకు తగ్గట్టే అభ్యర్ధులను కూడా పోటీలో నిలబెట్టింది బీజేపీ. ఇన్ని సమీకరణాల మధ్య గ్రేటర్ పరిధిలోని చాలా నియోజకవర్గాల్లో ఈసారి త్రిముఖ పోరు తప్పదని అంటున్నారు.
ఓటర్లే కీలకం..
హైదరాబాద్ పరిధిలో యువ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. కానీ ప్రతీసారి 50 శాతం కన్నా ఇక్కడ ఓటింగ్ జరగడం లేదు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, కుద్బుల్లాపూర్లలో గతంతో పోలిస్తే ఓటర్లు పెరిగారు.
అయినా కూడా ఓటింగ్ శాతం మాత్రం పెరగడం లేదు. ఇది అన్ని పార్టీలకు పెద్ద సమస్య. మరోవైపు గ్రేటర్ పరిధిలో చదువుకున్న వారు, రాజకీయ అవగాహన ఎక్కువ ఉన్నవారూ కూడా ఎక్కువగానే ఉంటారు. అలాంటి వారిని ఏపార్టీ ఎంతవరకు ఆకర్షించింది అన్నది కూడా ఇక్కడ ముఖ్యమే. ఇందులో మిగతా పార్టీల కంటే బీఆర్ఎస్ ఒక అడుగు ముందే ఉందని చెప్పాలి. మంత్రి కేటీఆర్ గ్రేటర్ పరిధిలోని యువ ఓటర్లను ఆకర్షించేందుకు చాలా ప్రయత్నించారు. మామూలుగానే ట్విట్టర్ లో అందరికి అందుబాటులో ఉండే కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో కూడా హైదరాబాద్ అంతా తెగ తిరిగేశారు. జనం మధ్యలోకి వెళ్ళి కలిపిసోయి మరీ ప్రచారం చేశారు. ఇది ఆ పార్టీకి ప్లస్ గానే మారుతుంది అని చెప్పవచ్చును. మరోవైపు టీడీపీ ఈ ఎన్నికల్లో దూరంగా ఉంటం తమకు లాభిస్తుందని అన్ని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. బీజేపీ , కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు టీడీపీ జెండాలను కూడా తమ ర్యాలీల్లో కనిపిచేలా చేసుకున్నారు. అధికారపార్టీ మాత్రం ఐటీ ఉద్యోగులతో పాటు, గ్రేటర్ పరిధిలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు, పాత బస్తీలో మినహా ఎంఐఎం మద్దతుతో తాము గత ఎన్నికల్లో గెలుచుకున్న స్థానాలను తిరిగి నిలబెట్టుకుంటామనే విశ్వాసంతో ఉన్నది.